ఈరోజు ఉదయం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా పడినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఆరు వారాల పాటు ఎన్నికలు వాయిదా పడ్డాయి. అత్యున్నత స్థాయి సమావేశం తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రకియ నిలిపివేత మాత్రమేనని, రద్దు కాదని రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం గురించి టీడీపీ స్పందించింది. 
 
ఎన్నికలను వాయిదా వేయడం కాదు... రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ చాలా దారుణంగా జరిగిందని చెప్పారు. ఎన్నికల వాయిదాకు కరోనా కారణమని తాము అనుకోవడం లేదని వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్రలో ఎన్నికలు వాయిదా వేయడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదని చెప్పారు. 
 
ఈసీ కరోనా అని చెప్పినప్పటికీ ఇంత అప్రజాస్వామికంగా, అన్యాయంగా ఎప్పుడూ ఎన్నికలు దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగలేదని అన్నారు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు అన్నీ చూసిన తరువాత ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా..? ఆటవిక రాజ్యంలో ఉన్నామా...? అధికార యంత్రాంగం అసలు ఉందా...? పోలీస్ యంత్రాంగం అసలు ఉందా...? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. 
 
ఈరోజు ఎన్నికల కమిషనర్ చాలా చర్యలు తీసుకున్నారని, ఇదే విధంగా ఈసీ ఏరోజుకు ఆరోజు చర్యలు తీసుకుంటే ఇంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చేవి కాదని అచ్చెన్నాయుడు తెలిపారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో దహన కాండ జరిగిందని అన్నారు. మరోవైపు జనసేన పార్టీ కూడా రాష్ట్రంలో ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేయడం గమనార్హం. మళ్లీ కొత్తగా నామినేషన్ల ప్రక్రియ చేపట్టాలని ఎన్నికల కమిషన్ ను తాను కోరుతున్నానని పవన్ మీడియాతో తెలిపారు.               

మరింత సమాచారం తెలుసుకోండి: