గంటకో మలుపు.. సెకనుకో ట్విస్ట్‌... ఇది మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు. కమల్‌నాథ్‌ సర్కార్‌ ఫ్యూచర్‌ క్రికెట్‌ బంతిలా మారింది. రేపటిలోగా బల పరీక్షను నిరూపించుకోవాలని కమల్‌నాథ్‌కు లేఖ రాశారు గవర్నర్‌ లాల్జీ టాండన్‌. లేదంటే ప్రభుత్వానికి మెజారిటీ లేదని పరిగణించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.

 

మధ్యప్రదేశ్‌లో హైడ్రామా కొనసాగుతూనే ఉంది. కరోనా కారణంగా చూపి స్పీకర్‌ అసెంబ్లీని వాయిదా వేశారు. అంతకుముందు సభను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌ మధ్య ప్రదేశ్‌ ప్రతిష్టను నిలపాలని సూచిస్తూ బలపరీక్ష తక్షణమే చేపట్టాలని స్పీకర్‌ను కోరారు. అయితే గవర్నర్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా స్పందించిన స్పీకర్‌ కరోనా కారణంగా చూపి ఈ నెల 26 వరకు అసెంబ్లీ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 

 

బలపరీక్ష వాయిదా పడటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన  బీజేపీ సుప్రీంను ఆశ్రయించింది. ఆ తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు బీజేపీ ఎమ్మెల్యేలు. గవర్నర్ ముందు పరేడ్‌ చేశారు ఎమ్మెల్యేలు. బీజేపీకి ఉన్నా సంఖ్యాబలం పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు. 12 గంటల్లో అసెంబ్లీలో బలపరీక్ష జరిపించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు. 

 

బీజేపీ సంఖ్యా బలం పత్రం చూపడంతో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్‌కు లేఖ రాశారు గవర్నర్ లాల్జీ టాండన్. రేపటిలోగా బల పరీక్షను నిర్వహించాలని ఆదేశించారు. లేదంటే ప్రభుత్వానికి అసెంబ్లీలో మెజారిటీ లేదని పరిగణించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు గవర్నర్. ఇటీవలే22 మంది కాంగ్రెస్‌ రెబెల్‌ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో బీజేపీ గూటికి చేరడంతో విశ్వాస పరీక్షపై ఉత్కంఠ నెలకొంది. ఆరుగురు మంత్రులతో సహా 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మార్చి 10 న శాసనసభకు రాజీనామా చేశారు.అయితే రాజీనామా చేసిన 22మంది ఎమ్మెల్యేలలో ఆరుగురి రాజీనామాలను మాత్రమే స్పీకర్ ఆమోదించారు. దీంతో సభలో మొత్తం సభ్యుల సంఖ్య 222కు చేరింది. 112 మ్యాజిక్ ఫిగర్ ని సాధిస్తే, కమల్ నాథ్ సర్కారు నిలబడే అవకాశం ఉంది. మిగిలిన 16మంది రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలు ఇంకా ఆమోదించ లేదు. 

 

ఈ రాజీనామాలను కూడా ఆమోదిస్తే కాంగ్రెస్ బలం 92కి పడిపోతుంది. అదే సమయంలో ఇప్పటి వరకు కాంగ్రస్ తో ఉన్న నలుగురు ఇండిపెండెంట్లు, ఒక ఎస్పీ, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేల్లో ఇవాళ బలపరీక్షలో కాంగ్రెస్ ఉండేదెవరు? బీజెపీ వైపు మళ్లేదెవరనే సందేహాలు కూడా ఉన్నాయి. సో.. ఓవరాల్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నర్‌ ఆదేశంతో రేపు జరగబోయే బలపరీక్ష కమల్‌ నాథ్‌ కు కత్తి మీద సాములా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: