దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రధాని మోదీ మూడువారాలపాటు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ నెల 14 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో రోజురోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రపంచంలో మన కంటే ముందు లాక్ డౌన్ ప్రకటించిన దేశాల్లో ఇప్పటికీ లాక్ డౌన్ కొనసాగుతోంది. 
 
మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,500కు చేరగా మృతుల సంఖ్య 90 దాటింది. ప్రతిరోజు 400 నుంచి 500 వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. అధికారులు మాత్రం లాక్ డౌన్ ను కొనసాగించేందుకు ప్రధాని మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. అధికారులు లాక్ డౌన్ ను కొనసాగించే అవకాశం లేదని... లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత పరిస్థితులు అదుపు తప్పితే మళ్లీ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. 
 
కేంద్రం లాక్ డౌన్ ఎత్తివేసినా కొన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని సమాచారం. లాక్ డౌన్ తర్వాత కేంద్రం ఏప్రిల్ 30 వరకు ప్యాసింజర్ రైళ్లను, జనరల్ బోగీలను క్లోజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయా రాష్ట్రాలలో పరిస్థితులను బట్టి దశల వారీగా బస్సు సర్వీసులను ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. కిరాణా షాపులపై, సూపర్ మార్కెట్లపై ఆంక్షలు సడలించే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
లాక్ డౌన్ తర్వాత దేశీయ విమాన సర్వీసులకు అనుమతులు ఇవ్వనున్నారని తెలుస్తోంది. అంతర్జాతీయ సర్వీసులపై మాత్రం ఆంక్షలు కొనసాగనున్నాయి. కేంద్రం వృద్ధులు, పిల్లలు పూర్తిగా ఇంటికే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేయనుంది. బార్లు, థియేటర్లు, ఇతర వాణిజ్య సంస్థలకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్రం నుంచి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: