దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ వల్ల అత్యవసరంగా ఊరెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ ఊళ్లకు వెళ్లేందుకు అనుమతులు ఇవ్వాలంటూ వేల సంఖ్యలో ప్రజలు స్థానిక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. 
 
ప్రతిరోజూ వందల సంఖ్యలో ప్రజలు అనుమతి కోసం పోలీస్ స్టేషన్లకు వస్తూ ఉండటంతో రాచకొండ పోలీసులు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. అత్యవసరంగా ఊరెళ్లాలనుకుంటే ఇంట్లోనే ఉండి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసిన 8 నుంచి 16 గంటల్లో ఈ మెయిల్ కు ఈ పాస్ లు వస్తాయి. పాస్ సహాయంతో ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. 
 
సీపీ మహేష్ భగవత్ అత్యవసరంగా ఊరెళ్లేవారు ఇబ్బందులు పడకుండా ఆన్ లైన్ లో పాస్‌లు జారీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ పాస్ పొందాలనుకునుకునే వారు https://covid-tspolice.nvipani.com/ లో రిక్వెస్ట్ ఫర్ పాస్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. అనంతరం వివరాలను, సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అప్ లోడ్ చేయాలి. సిబ్బంది దరఖాస్తును పరిశీలించి దరఖాస్తుదారు మెయిల్ కు ఒక లింక్ పంపిస్తారు. 
 
ఆ లింక్ ఓపెన్ చేసి ఈ పాస్ పొందవచ్చు. పాస్‌లు దుర్వినియోగం కాకుండా పక్కాగా జాగ్రత్తలు తీసుకున్నామని రాచకొండ ఐటీ ఇన్ స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ సేవలను రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వారు మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులు దరఖాస్తు స్టేటస్ ను కూడా తెలుసుకునే ఏర్పాట్లు చేశామని శ్రీధర్ రెడ్డి అన్నారు. పోలీస్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త అనే చెప్పవచ్చు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: