ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. రాష్ట్రంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నిన్న 15 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 420కు చేరింది. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.  మార్చి నెల మూడవ వారం వరకు కరోనా కేసులు నమోదు కాని ఈ జిల్లాలో మార్చి చివరి నుంచి కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించింది. 
 
నిన్నటివరకూ కర్నూలు జిల్లాలో 84 కేసులు నమోదయ్యాయి. కర్నూలు తరువాత గుంటూరులో కరోనా వేగంగా విస్తరిస్తోంది. గత మూడు రోజులుగా గుంటూరు జిల్లాలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మొన్న గుంటూరులో 17 కేసులు నమోదు కాగా నిన్న 7 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో బాధితుల సంఖ్య 82కు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొత్త కేసులు నమోదు కాకుండా లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. 
 
కరోనా కేసుల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తరువాత స్థానాలలో ఉన్నాయి. నెల్లూరులో నిన్నటివరకు 52 కేసులు నమోదు కాగా ప్రకాశం జిల్లాలో 41 కేసులు నమోదయ్యాయి. కృష్ణాలో 35 కేసులు నమోదు కాగా కడపలో 31 కేసులు నమోదయ్యాయి. ఈ ఆరు జిల్లాలలో కరోనా పంజా విసురుతోంది. వైజాగ్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప జిల్లాల్లో 20కు అటూఇటుగా కేసులు నమోదయ్యాయి. 
 
రాష్ట్రంలో 11 జిల్లాలలో కరోనా కేసులు నమోదు కాగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అధికారులు తీసుకుంటున్న చర్యలు, ప్రజల సహకారం వల్లే ఈ రెండు జిల్లాలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలుస్తోంది. కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా , కడప జిల్లాలలో ఎక్కువ కేసులు నమోదు కావడంతో ఈ జిల్లాల ప్రజలు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: