దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఈరోజు నమోదయ్యే కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,00,000 దాటనుంది. దేశవ్యాప్తంగా 5600 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. మరోవైపు కేంద్రం కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నా లాక్ డౌన్ లాక్ డౌన్ కు భారీగా సడలింపులు ఇస్తోంది. లాక్ డౌన్ వల్ల దాదాపు 40 రోజుల పాటు మద్యానికి దూరమైన మందుబాబులకు ఒడిశా సర్కార్ వరుస శుభవార్తలు చెబుతోంది. 
 
గత నెలలో ఒడిశా ప్రభుత్వం మద్యం హోం డెలివరీని ప్రారంభించింది. మద్యం హోం డెలివరీకి ఊహించని రీతిలో స్పందన రావడంతో ఒడిశా స్టేట్‌ బెవరేజస్‌ కార్పొరేషన్‌ (ఓఎస్‌బీసీ) పోర్టల్ నే ప్రారంభించింది. మద్యం హోం డెలివరీ ప్రారంభించిన సమయంలో మందుబాబులు ఆయా దుకాణాల వద్ద ఏర్పాటు చేసిన నంబర్లకు ఫోన్‌ చేస్తే హోం డెలివరీ జరిగేది. జోమాటో, స్విగ్గీ వంటి అగ్రిగేటర్ల సేవలను వినియోగించుకుని ప్రభుత్వం మద్యం డెలివరీ చేసింది. 
 
రిటైలర్లు విస్తృతంగా ఫోన్ నంబర్లను ప్రచారం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి ఆదివారం వరకు సుమారు దాదాపు రెండున్నర లక్షల ఆర్డర్లు వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మద్యం ప్రియులను దృష్టిలో ఉంచుకుని సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మద్యానికి ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని https://osbc.co.in/ వెబ్ సైట్ ను ప్రారంభించింది. 
 
ప్రభుత్వం వెబ్ పోర్టల్ లో జిల్లాలో ఉన్న రిటైలర్ల వివరాలు, బ్రాండ్లు, ఎంఆర్‌పీ తదితర వివరాలను అందుబాటులో ఉంచుతుంది. మద్యం ప్రియులు నచ్చిన బ్రాండ్ ను ఆన్ లైన్ లోనే ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్‌ చేయగానే ఎంఆర్పీతో పాటు, డెలివరీ ఛార్జీలతో కూడిన బిల్లు ఆన్ లైన్ లో వస్తుంది. క్రెడిట్, డెబిట్ కార్డులను వినియోగించి ఆర్డర్ చేయవచ్చు. త్వరలో యూపీఐ, నెట్‌బ్యాంకింగ్‌, ఫీడ్‌బ్యాక్‌ వంటి ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన వారికి స్థానిక రిటైలర్ల నుంచి డోర్ డెలివరీ జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: