2014 వరకూ వాళ్లంతా ఒకే స్థాయిలో పనిచేశారు. కానీ రాష్ట్ర విభజన వారి తలరాతలను మార్చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నవారు హమ్మయ్య బతికిపోయాం.. అని ఆనందపడుతుండగా... తెలంగాణ ఉన్న వారు మాత్రం.. ఎందుకిలా మా ఖర్మ కాలిపోయిందీ అని తలపట్టుకుని కూర్చుంటుంన్నారు. ఇంతకీ ఎవరు వాళ్లంతా అంటారా.. వాళ్లే రెవెన్యూ శాఖ ఉద్యోగులు.

 

 

అవును తెలంగాణలో రెవెన్యూ శాఖను సమూలంగా ప్రక్షాళన చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఎమ్మార్వోల అధికారాలను ఇతర శాఖలకు బదిలీ చేస్తూ ఆ పోస్టును బలహీన పరుస్తున్నారు. మరోవైపు ఏకంగా వీఆర్వో ఉద్యోగాలనే రద్దుచేయాలని భావిస్తున్నట్టు ఏకంగా మంత్రులే చెబుతున్నారు. తెలంగాణలో గ్రామ రెవెన్యూ అదికారుల వ్యవస్థను రద్దు చేసే ఆలోచన ఉన్నట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చెప్పారు. విఆర్వోల తీరు వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అంటున్నారు.

 

 

రైతుల పేర్లు భూ రికార్డులలోకి ఎక్కడం లేదని, పట్టాదార్ పాస్ పుస్తకాలు అందడం లేదని, ఫలితంగా వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందడం లేదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. దీనికి కారణం విఆర్వోలేనని, అందుకే ఈ వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని ఎర్రబెల్లి అంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను పునర్వ్యవస్థీకరిస్తారని ఆ శాఖలో గగ్గోలు మొదలైంది. ఇలాంటి సమయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి.

 

 

అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూస్తే పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. అక్కడ తాజాగా జగన్ సర్కారు ఓ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వీఆర్ఏ లుగా పని చేస్తున్న దాదాపు 10 వేల మందికి వీఆర్వోలుగా ప్రమోషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇంటర్ అర్హత ఉంటే చాలు వారికి ప్రమోషన్ లభించబోతోందన్నమాట. అదీ రెండు రాష్ట్రాల్లో రెవెన్యూ ఉద్యోగుల సంగతి.

మరింత సమాచారం తెలుసుకోండి: