దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయం కొనసాగుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూ ప్రజల్లో భయాందోళనను అంతకంతకూ పెంచుతున్నాయి. ఏపీలో ప్రతిరోజూ 50,000కు అటూఇటుగా కరోనా పరీక్షలు చేస్తుండగా తెలంగాణలో తక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కరోనా పరీక్షల విషయంలో గతంలో తెలంగాణ సర్కార్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
 
మరోవైపు రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 20 సంచార వాహనాల ద్వారా ప్రజల చెంతకే కరోనా నిర్ధారణ పరీక్షల కేంద్రం తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని బస్తీదవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా బోధనాసుపత్రులన్నింటిలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సేవలను విస్తరించింది.
 
తొలుత సంచార వాహనాలను ప్రభుత్వం కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో వినియోగిస్తుంది. నేటి నుంచే ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ బస్సుల్లో ఒకేసారి 10 మంది నమూనాలను సేకరించవచ్చు. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల ద్వారా పరీక్ష చేయించుకున్న కొద్ది సమయంలోనే ఫలితాలు వెల్లడవుతాయి. కరోనా లక్షణాలు ఉండి యాంటీజెన్ పరీక్షల్లో నెగిటివ్ వస్తే ఆర్టీ పీసీఆర్ పరీక్ష నిర్వహిస్తారు.
 
ప్రభుత్వ నిర్ధారణ పరీక్ష కేంద్రాలకు ఆ నమూనాలను పంపిస్తారు. మరో 30 వాహనాలను ప్రభుత్వం వచ్చే వారం అందుబాటులోకి తీసుకురానుంది. పరీక్షలు చేసే వైద్య సిబ్బంది లక్షణాలు ఎక్కువగా ఉన్నవారిని వెంటనే ఆంబులెన్సులో ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుంది. భారీ సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం రానున్న రోజుల్లో ఇతర కంటైన్మెంట్ ప్రాంతాల్లో సైతం ఈ వాహనాలను అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 1,764 కేసులు నమోదు కాగా 12 మంది మృతి చెందారు.




మరింత సమాచారం తెలుసుకోండి: