భార‌త స‌రిహ‌ద్దుల‌ను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తామని చైనాకు భార‌త్ స్ప‌ష్టం చేస్తోంది.  సరిహద్దులను, ప్రాదేశిక సమగ్రతను, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి పూర్తిగా సంసిద్ధమయ్యా మంటూ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మ‌రోమారు స్ప‌ష్టం చేశారు. దేనికైనా రెడీ అంటూ చైనాకు హెచ్చ‌రిక‌లు పంపారు. భార‌త భూభాగంలోకి చైనా సైనిక మూక‌లు చొచ్చుకు రాకుండా చూసేందుకు భార‌త బ‌లగాల‌ను స‌రిహ‌ద్దుల వ‌ద్ద మొహ‌రించిన విష‌యం తెలిసిందే. దొంగ దెబ్బ తీసేందుకు చైనా య‌త్నిస్తూనే ఉంది. పలుమార్లు ఈ ప్ర‌య‌త్నాల‌ను భార‌త బ‌ల‌గాలు తిప్పికొట్టినా బుద్ధి మార్చుకోవ‌డం లేదు.



‘లద్దాఖ్‌ ప్రాంతంలో 38 వేల చదరపు కిలోమీటర్ల భార‌త‌ భూభాగాన్ని చైనా ఆక్రమించింది. 1963లో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఆక్రమిత కశ్మీర్‌లోని 5180 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఽచైనాకు పాకిస్థాన్‌ ధారాదత్తం చేసింది. తూర్పున అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుల్లో మరో 90 వేల చదరపు కిలోమీటర్ల భూభాగం తమదేనని చైనా త‌ప్పుడు వాద‌న‌లను విని పిస్తోంది. గ‌త ఒప్పందాల ప్రకారం కుదరిన సరిహద్దుల్ని చైనా గుర్తించక‌పోవ‌డం విచార‌క‌రం. వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితిని ఏకపక్షంగా మార్చేయాలని చూస్తోంది. ఇది మాకు సమ్మతం కాదని చైనాకు స్పష్టం చేశాం’’  అంటూ కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి  రాజ్‌నాథ్ సింగ్‌ వివరించారు.


దేశ సరిహద్దుల్లో ఎలాంటి అనూహ్య పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో చైనా నుంచి భారత్‌ ఒక సవాలును ఎదుర్కొంటోందని తెలిపారు. వాస్తవాధీన రేఖను మార్చేందుకు చైనా చేస్తున్న ఏకపక్ష ప్రయత్నాలు భారత్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదన్న విషయాన్ని ఆ దేశానికి చాలా స్పష్టంగా చెప్పామని లోక్‌సభకు వివరించారు. చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలకు సంబంధించి రాజ్‌నాథ్‌ మంగళవారం లోక్‌సభలో ఒక ప్రకటన చేసిన విష‌యం తెలిసిందే. దీంతో రెండు దేశాల మ‌ధ్య వాతావ‌ర‌ణం వేడెక్కిన‌ట్లుగా స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: