విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతోందా.. ఇన్ని రోజులు అంటీముట్టనట్టు ఉంటున్న రాములమ్మ తీరు చూస్తుంటే అవునూ అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.

సినిమా రంగంలో లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకున్న విజయశాంతి రాజకీయాల్లో ఆ స్థాయిలో రాణించలేకపోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రాములమ్మ.. ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు. ముందస్తు ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో విజయశాంతి కీలకపాత్ర పోషించారు. మొదట కాంగ్రెస్‌లో చురుకైన పాత్ర పోషించినప్పటికీ.. మెల్లమెల్లగా సైలెంట్ అయ్యారు. ఇటు రాష్ట్రం, అటు కేంద్రంలో కాంగ్రెస్ అధికారానికి దూరం అవ్వడంతో విజయశాంతి కూడా యాక్టివ్‌ పాలిటిక్స్‌ తగ్గించారు. అడపాదడపా పార్టీ సమావేశాలకి వచ్చేవారు. ఇప్పుడు అది కూడా తగ్గించారు.

కాంగ్రెస్‌కు కొత్త రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ వచ్చాక మొదటి సమావేశానికి హాజరుకావాలని రాములమ్మకు కబురు వెళ్లింది. అయినప్పటికీ ఆమె డుమ్మా కొట్టారు. అంతకుముందు సమావేశాలకు ఆహ్వానం లేకనే వెళ్లలేదు అని చెప్పేది విజయశాంతి. కానీ ఠాగూర్ వచ్చాక ఆహ్వానించినప్పటికీ, సమావేశాలకు హాజరుకాలేదు. కొత్త ఇంఛార్జ్ అనగానే.. సాధారణ కార్యకర్తనుంచి.. పీసీసీ పెద్దలవరకంతా వెళ్లి కలుస్తారు. కానీ విజయశాంతి వెళ్లకపోవడంతో.. ప్రత్యామ్నాయ రాజకీయంపై దృష్టిపెట్టారనే చర్చ మొదలైంది. ఇన్నాళ్లు ఈ వ్యవహారం గోప్యంగా ఉన్నా, ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి... విజయశాంతితో భేటికావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని వెనుక రాజకీయ కారణం ఉంటుందనే వాదన వినిపిస్తోంది. బీజేపీ అగ్ర నాయకత్వంతో విజయశాంతికి మంచి సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్‌తో అంటీముట్టనట్లు ఉంటూ తాజాగా కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డితో భేటీ కావడంతో విజయశాంతి.. కాంగ్రెస్‌కు హ్యాండివ్వడం ఖాయమనే వాదన మొదలైంది.

విజయశాంతి ఇప్పటికే పలుమార్లు పార్టీలు మారారు. బీజేపీతో మొదలై ఆ తర్వాత టీఆర్‌ఎస్, అక్కడి నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు మళ్లీ బీజేపీ నేతలతో సంప్రదింపులు జరపడం ఆసక్తికరంగా మారింది. మరి రాములమ్మ అడుగులు ఎటువైపు పడతాయో కొద్దిరోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశముంది.




మరింత సమాచారం తెలుసుకోండి: