తెలంగాణ రాష్ట్రం విషయంలో డిల్లీలో అధిష్టానాన్ని కలుస్తున్నామని చెబుతున్నటువంటి నాయకుల మాటలు అంతగా నమ్మదగినవిగా అనిపించడం లేదు. తెలంగాణ ప్రాంతం నుండి డిల్లీకి వెళ్తున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, టిఆర్ఎస్ నాయకులు అధిష్టానాన్ని కలుస్తున్నారా లేదా అనేది చర్చనీయాంశమైంది. అధిష్టానాన్ని కల్సి పరిస్థితులన్ని వివరించామని ఇందుకోసం అధిష్టానం సానుకూలంగా స్పందించిందని డిల్లీకి వెళ్లిన తెలంగాణ ప్రాంత నాయకులు చెబుతున్నటువంటి ముచ్చట్లు తెలంగాణ ప్రజలు సంవత్సరాలుగా వింటూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం త్వరలోనే వస్తుందని, నెలరోజుల్లో నే రాష్ట్ర ప్రకటన వెలువడుతుందని, ఇటువంటి సందర్భంలో తెలంగాణ మార్చ్ అవసరం లేదని కెసిఆర్ తెలంగాణ జెఎసికి సూచించారు. అయినప్పటికిని ఆమాటలు వినకుండా, తెలంగాణ మార్చ్ ను వాయిదా వేయకుండా, తెలంగాణ మార్చ్ ను తెలంగాణ జెఎసి విజయవంతంగా నిర్వహించింది. కాగా తెలంగాణ నెలరోజుల్లో వస్తుందని అన్నటువంటి కెసిఆర్ గడువు దాటిపోయింది. చేసేది లేక మళ్లీ కెసిఆర్ ఫాంహౌజ్ బాట పట్టారు. వచ్చే ముందు టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ రెండుమూడు మాటలు మీడియా ముందు వెల్లడించారు. తెలంగాణ విషయంలో మీడియా ప్రచారం చేసినదానికంటే ఎక్కువమందిని తాను కల్సినట్టు చెప్పారు. ఈ మాటలు వినడం మినహాయించి కల్సినప్పుడు ఎవరుచూడలేదు, వినలేదు. కాగా తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్లు తాము అధిష్టానాన్ని కల్సినట్లు, అందుకు వారు అనుకూలంగా స్పందించారని ప్రతిసారి అంటుంటారు. కొంత మంది నాయకులైతే ఏకంగా సోనియా గాంధీని కల్సి పరిస్థితులు వివరించామని చెబుతుంటారు. అయితే ఇలా మాట్లాడే నాయకులు అధిష్టానాన్ని కల్సి తెలంగాణ పరిస్థితుల గూర్చి వివరించారా లేదా అనేది వారికే తెలియాలి. సోనియాగాంధీని ఆమె నివాసంలో కల్సి తెలంగాణ గూర్చి చెప్పామంటున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియాగాంధీ నివాసం ఉండేటువంటి ఇంటి “గడప” దాటారా అనేది ఇప్పటి వరకు అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన టిఆర్ఎస్ తో పాటు అధికార పార్టీ నాయకులు అధిష్టానాన్ని కలిశారనుకుందాం. అయితే ఇంత మంది కల్సిన అధిష్టానం ఎందుకు స్పష్టమైన వైఖరిని తెలియజేయడం లేదనేది అంతుపట్టని విషయం. తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు అధిష్టానాన్ని కల్సినట్టు, అందుకు సానుకూలంగా అధిష్టానం స్పందించినట్లు చెబుతుండగా అధిష్టానంగా పిలువబడే కేంద్రమంత్రులు మాత్రం ఏకాభిప్రాయం కావాలని ఒకరు, తెలంగాణ సమస్య అంత తొందరగా తేలేది కాదని మరొకరు, వాట్ తెలంగాణ అంటూ ఇంకొక మంత్రి అనడంను బట్టి చూస్తే తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు అధిష్టానాన్ని కలిశామంటున్నటువంటి మాటల్లో నిజమెంతుందో వారికే వదిలేద్దాం. కాగా తెలంగాణ విషయంపై తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి డి.కె అరుణ అధిష్టానాన్ని కలిసేందుకు డిల్లీ వెళ్తున్నారు. డిల్లీకి వెళ్తున్న మంత్రి తిరిగి వచ్చి ఎటువంటి విషయాలు వెల్లడిస్తుందో వేచిచూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: