ఎన్నికల వ్యుహంపై సరూర్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ అభ్యర్థి అనితా దయాకర్‌రెడ్డితో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సోమవారం హుడాకాలనీలోని ఆమె నివాసంలో సమావేశమయ్యారు. ప్రతీ ఓటు ఎంతో విలువైందని, బూత్‌ కమిటీ మెంబర్‌లను అప్రమత్తం చేయాలని ఆమె సూచించారు. నేడు జరిగే ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచడానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సరూర్‌నగర్, ఆర్‌కేపురం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ఎలాంటి అవ‍కతవకలు జరగకుండా ప్రశాంతంగా జరిగేలా పోలీసులు చూడాలన్నారు. డివిజన్‌లో 83 బూత్‌ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కోక్క బూత్‌లో ఆరుగురు సభ్యులను నియమించినట్లు ఆమె పేర్కొన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతీ పౌరుడు ఓటు హక్కు వినియోగించుకునేలా పార్టీ కార్యకర్తలు చూడాలన్నారు.
 
మూసారంబాగ్‌ డివిజన్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన నియోజకవర్గ కాంగ్రెస్‌ సినీయర్‌ నాయకుడు మందడి విజయసింహారెడ్డి, ఏ-బ్లాక్‌ అధ్యక్షుడు బద్దం సురేందర్‌రెడ్డిను పార్టీ నుంచి బహిష్కరించినట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌ తెలిపారు. సోమవారం సలీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ కార్పొరేటర్‌ చేకోలేకర్‌ శ్రీనివాస్‌ సతీమణి సదాలక్ష్మికి పార్టీ అధిష్టానం మూసారంబాగ్‌ టికెట్‌ కేటాయించడం జరిగిందన్నారు.

ఇద్దరు వ్యక్తులు పార్టీ తరుఫున ఎన్నికలో బరిలో నిలిచిన సదాలక్ష్మికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న విషయం టీసీపీసీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి వెళ్లిందన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు విజయసింహారెడ్డి, సురేందర్‌రెడ్డి ప్రాథమిక సభ్యత్వం రద్దు చేస్తూ పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుని కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి పని చేయాలని బెదిరింపులకు పాల్పడినట్లు అధిష్టానంకు సమాచారం వచ్చింది. ఈ మేరకు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్‌ నేత చేకోలేకర్‌ శ్రీనివాస్, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి సంఘిరెడ్డి, రవిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: