ప్రముఖ అథ్లెడ్, పరుగుల వీరుడు మిల్కాసింగ్‌ 91వ ఏట కరోనాతో కన్నుమూశారు. నెల రోజుల పాటు కరోనాతో పోరాడిన మిల్కాసింగ్‌ చివరకు ఆ పరుగులో అలసిపోయారు..శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. గత నెల 20న మిల్కాసింగ్‌కు కరోనా నిర్ధరణ కాగా.. ఈ నెల 3న ఐసీయూలో చేరారు. ఇటీవలే కరోనాతో మిల్కాసింగ్‌ సతీమణి కూడా కన్ను మూశారు. భారత అథ్లెట్ రంగంలో మిల్కాసింగ్‌ కెరీర్‌ ఓ ప్రత్యేక అధ్యాయం.. ఏంటి ఆయన ప్రత్యేకత.. ఏంటి ఆయన సాధించిన విజయాలు.. చూద్దాం..

1929 నవంబర్‌ 20న పాక్‌ పంజాబ్‌లోని గోవింద్‌పురలోని సిక్‌ రాథోడ్‌ రాజపుత్రుల కుటుంబంలో  మిల్కాసింగ్ పుట్టారు. ఫ్లయింగ్‌ సిఖ్‌గా మన్ననలు పొందిన అథ్లెట్‌ మిల్కా సింగ్‌.. భారత దేశ క్రీడా ఆణిముత్యంగా మిల్కాసింగ్‌కు గుర్తింపు తెచ్చారు. 1951లో భారత సైన్యంలో చేరిన మిల్కా సింగ్‌ సికింద్రాబాద్‌లో 9 ఏళ్లు శిక్షణ పొందారు. మిల్కాకు ఆర్మీ వ్యాయామ క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. పరుగు పోటీల్లో మిల్కా సింగ్ అరుదైన ఘనతలు సాధించారు.


1958 జాతీయ క్రీడల్లో మిల్కా సింగ్ రెండు బంగారు పతకాలు సాధించారు. 1958లో బ్రిటీష్‌ ప్రభుత్వం, కామన్‌వెల్త్‌ నిర్వహించిన పోటీల్లో 46.6 సెకన్లలో 440 యార్డ్స్‌ పరుగెత్తి స్వర్ణం గెలిచారు. భారత్‌ తరఫున స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు. ఈ మిల్కా రికార్డును నాలుగు దశాబ్దాలపాటు ఎవరూ అధిగమించలేకపోయారు. అలాగే 1958, 1962 ఏషియన్‌ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు.


1960 పాక్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో స్వర్ణం చేజిక్కించుకున్న మిల్కాను ఆనాటి పాక్ ప్రధాని అయూబ్‌ ఖాన్ ఫ్లయింగ్‌ సిఖ్‌గా అభివర్ణించారు. తన క్రీడా జీవితంలో 80 రేసుల్లో 77 సార్లు విజయం సాధించడం ఓ అరుదైన ఫీట్ గా చెప్పాలి. 1959లోనే మిల్కా సింగ్‌ను కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. 2001లో అర్జున పురస్కారం వచ్చినా మిల్కా సింగ్‌ తిరస్కరించారు. జీవిత చరమాంకంలో విశ్రాంత క్రీడాకారుల వైద్య ఖర్చుల కోసం మిల్కా సింగ్ ఓ ట్రస్ట్‌ నెలకొల్పారు. మిల్కా జీవితం ఆధారంగా తెరకెక్కిన 'బాగ్‌ మిల్కా బాగ్‌' చిత్రం కూడా రికార్డులు సృష్టించడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: