కరోనా కట్టడిలో దేశంలోనే నెంబర్ వన్‌ గా నిలుస్తున్నామంటోంది ఆంధ్రప్రదేశ్ సర్కారు. కొవిడ్ రోగుల కోసం ఏపీ సర్కారు నిర్వహిస్తున్న ఇ- సంజీవని కార్యక్రమం సేవల్లో.. దేశంలోనే రాష్ట్రం అగ్రగామి ఉందని ప్రకటించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో ఇ-సంజీవని టెలీకన్సల్టేషన్ ను అమలు చేస్తున్నారు. ఈ ఇ- సంజీవని కన్సల్టేషన్ ద్వారా కరోనా రోగులు ఆసుపత్రులకు వచ్చే అవసరం లేకుండా ఇంటి నుంచే వైద్యుల సేవలు పొందవచ్చు.


ఈ ఇ-సంజీవని సౌకర్యం కోసం 13 జిల్లాలోని వైద్య కళాశాలల్లో  టెలి మెడిసిన్ హబ్ లను ఏపీ సర్కారు  ఏర్పాటు చేసింది. ప్రతి టెలిమెడిసిన్ హబ్ లో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు, ముగ్గురు స్పెషలిస్టుల ద్వారా సేవలు అందిస్తున్నారు. వీటిని రాష్ట్రంలోని 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,  2,914  ఆరోగ్య ఉప కేంద్రాలకు టెలికన్సల్టేషన్  సేవలు అనుసంధానం చేశామని అధికారులు చెబుతున్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రోగులను పరీక్షించి వైద్యం చేస్తున్నారు. రోగులకు అవసరమైన మందుల   ప్రిస్క్రిప్షన్లు సూచిస్తున్నారు.


వీడియో కాన్ఫరెన్సు ద్వారా రోగులకు వైద్యులు సూచించిన మందులను నేరుగా రోగుల ఇంటికే సరఫరా చేస్తున్నామని కోవిడ్ కమాండ్ కంట్రోల్ నోడల్ అధికారి  అర్జా శ్రీకాంత్ ప్రకటించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా లక్షల మందికి ఇ -సంజీవని ద్వారా సేవలు అందిస్తున్నామని ఆయన వివరించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 20,13,248 మందికి టెలిమెడిసిన్ కన్సల్టేషన్  సేవలు అందాయని ఆయన గణాంకాలు వివరించారు. ఈ లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ దేశంలోనే అత్యధికంగా ఇ- కన్సల్టెంగ్ ద్వారా సేవలు అందించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని ఆయన తెలిపారు.


ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ 20 వేల వరకూ యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. వీరిలో ఐదారు వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు ఇంటి నుంచే వైద్యం తీసుకుంటున్నారు. ఈ కొవిడ్ కంట్రోల్ కేంద్రం చెబుతున్న లెక్కలు నిజమే అయితే.. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: