భారీ వర్షం తిరుపతి, తిరుమలను అతలాకుతలం చేసింది. నిన్న భారీ వర్షంతో చాలాచోట్ల విరిగిపడిన చెట్లు, కొండచరియలు విరిగిపడ్డాయి. అలిపిరి కాలినడక మార్గంలోనూ భారీగా వరద  ప్రవహించింది.  భారీ వర్షాల కారణంగా తిరుపతి నుంచి తిరుమలకు వచ్చి వెళ్లే రెండు ఘాట్‌రోడ్లను నిన్న మూసేశారు. గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మూసివేశారు. ప్రస్తుతం ఘాట్ రోడ్లలో భక్తులను అధికారులు అనుమతిస్తున్నారు. రెండు ఘాట్‌రోడ్లలో విరిగిపడిన కొండచరియలను తొలగించి రాకపోకలకు అనుమతించారు.


అయితే.. వరద కారణంగా నడకమార్గంలో బాగా మట్టి పేరుకుపోయింది. మట్టి పేరుకుపోవడంతో అలిపిరి నడక మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అలిపిరి మెట్లపై పేరుకుపోయిన మట్టిని తొలగిస్తున్నారు. అందుకే తాత్కాలికంగా అలిపిరి నడక మార్గాన్ని టెంపరరీగా మూసివేశారు. శ్రీవారి మెట్ల మార్గంలో మాత్రం భక్తులను అనుమతిస్తున్నారు. వర్షం తగ్గడంతో ఉదయం 6 నుంచి భక్తులను అనుమతిస్తున్నారు.


తిరుపతి ఎయిర్‌పోర్టులో రాకపోకలకు సైతం అంతరాయం కలిగింది. తిరుపతికి రావాల్సిన ఆరు విమానాలు నిన్న వర్షం కారణంగా రాలేదు. హైదరాబాద్‌ - రేణిగుంట ఇండిగో విమానం వాతావరణం అనుకూలించక పోవడంతో మళ్లీ  హైదరాబాద్‌ తిరిగి వెళ్లింది. వర్షాల కారణంగా  విద్యాసంస్థలన్నింటికీ నిన్న, ఈ రోజు సెలవు ఇచ్చేశారు. తిరుపతి - చెన్నై మార్గంలో పుత్తూరు మండలం తడుకు సమీపంలో రైల్వేట్రాక్‌ మునిగింది.


తిరుపతి రుయా ఆసుపత్రి కూడా జలమయం అయ్యింది. అందుకే తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడిని దర్శించాలనుకుని వచ్చే వారు ఈ విషయాలను గమనంలోకి తీసుకోవాలి. తగిన జాగ్రత్తలతో శ్రీవారి దర్శనానికి రావాల్సి ఉంటుంది. తిరుమల తిరుపతి వచ్చే వారిలో చాలా మంది నడక మార్గంలో శ్రీవారిని దర్శించాలని కోరుకుంటారు. కొందరు ఆ విధంగా మొక్కులు మొక్కుకుంటారు. అలాంటి వారు.. తిరుపతి పర్యటన ఒకటి, రెండు రోజులు వాయిదా వేసుకుంటే మంచిది. ఒకట్రెండు రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: