తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు హిమాన్ష్‌ ను బాడీ షేమింగ్‌ చేస్తూ తీన్మార్ మల్లన్న పెట్టిన ట్వీట్‌తో ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్.. అదే సమయంలో సోషల్ మీడియా తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా అరాచకవాదుల అడ్డగా మారుతోందని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఉన్నవారిపై బురద జల్లేలా ప్రచారం చేయడం సోషల్ మీడియాలో సర్వసాధారణంగా మారిందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇటీవల బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్‌ చానల్‌లో నిర్వహించిన ఓ పోల్ ఈ వివాదానికి కారణంగా మారింది. తెలంగాణలో అభివృద్ధి జరగలేదని చెప్పేందుకు తీన్మార్ మల్లన్న ఈ పోల్ నిర్వహించారు. అభివృద్ది ఎక్కడ జరిగింది భద్రాచలంలోనూ.. హిమాన్ష శరీరంలోనా అన్న ప్రశ్నను పోల్ ద్వారా అడగటం వివాదానికి దారి తీసింది. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్ష కాస్త బొద్దుగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. దీన్ని వెటకారంగా ప్రస్తావిస్తూ తీన్మార్ మల్లన్న పోల్ నిర్వహించడం కేటీఆర్‌కు ఆగ్రహం తెప్పించింది.


దీనిపై జేపీ నడ్డాకు ట్విట్టర్ ద్వారా కేటీఆర్ ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కేటీఆర్ సోషల్ మీడియా తీరును తీవ్రంగా విమర్శించారు. సోషల్ మీడియా ప్రస్తుతం దుష్ప్రచారానికి సాధనంగా మారిందని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి వాస్తవాలు, ఆధారాలు లేకుండా ఏదైనా ప్రచారం చేసే అవకాశం లభిస్తోందని ఆయన విమర్శించారు. ఎవరు పడితే వాళ్లు.. ఏది పడితే అది ప్రచారం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.


ఇదే సమయంలో కేటీఆర్ యూట్యూబ్‌ వీడియోలపైనా మండిపడ్డారు. ఈ యూట్యూబ్ ఛానళ్లు మీడియా ముసుగులో 24 గంటలూ నానా చెత్త ప్రజలకు అందిస్తున్నాయన్నారు కేటీఆర్. చివరకు పిల్లలను సైతం రాజకీయ రొచ్చులోకి లాగుతూ ఇష్టానుసారం వార్తలు ప్రసారం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: