ఏపీ సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ప్రజలకు నచ్చాయి, ఆయనపై ఎక్కడా ఎవరూ కోపతాపాలు చూపించడంలేదు. అదే సమయంలో స్థానికంగా ఉండే సమస్యల పరిష్కారం ఎమ్మెల్యేలకు కుదరడంలేదు. కనీసం ఓ రోడ్డు వేయించుకోడానికి కూడా వారికి నిధులు అందడంలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాకపోవడంతో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందనే మాట వాస్తవం. ఈ క్రమంలో ఇతరత్రా సమస్యలు ఎమ్మెల్యేల మెడకే చుట్టుకుంటున్నాయి. దీంతో చాలా చోట్ల ఎమ్మెల్యేలపై కాస్తో కూస్తో వ్యతిరేకత పెరుగుతోంది. అదే సమయంలో నవరత్నాల అమలుతో సీఎం జగన్ పై ప్రేమ కూడా పెరుగుతోంది. తాజాగా జగన్ ముద్దు మా ఎమ్మెల్యే మాకు వద్దు అంటూ విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని కొందరు ప్లకార్డులు చేతబట్టుకోవడంతో కలకలం రేగింది.

పాయకరావు పేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు రాజవరం అనే గ్రామంలో మంచినీటి పైప్ లైన్ ప్రారంభించడానికి వెళ్లారు. ఆయన్ను సొంత పార్టీ కార్యకర్తలే అడ్డుకున్నారు. అంతే కాదు ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అక్కడితో ఆగితే అదేమంత సెన్సేషన్ అయ్యేది కాదు. కానీ ఎమ్మెల్యే వద్దు, సీఎం ముద్దు అనే నినాదాలు రాసిన ప్లకార్డులతో వారు హైలెట్ అయ్యారు. జగన్ ముద్దు - ఎమ్మెల్యే బాబూరావు వద్దు అంటూ వారు ప్లకార్డులు పట్టుకుని మీడియా కంటపడ్డారు. ఇంకేముంది రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారం సంచలనంగా మారింది.

ఎందుకీ వ్యతిరేకత..
స్థానికంగా టీడీపీ నేతలకు గొల్లబాబూరావు సపోర్ట్ చేస్తున్నారనేది రాజవరం గ్రామస్తుల ఆరోపణ. మా ఎమ్మెల్యే వైసీపీనా, టీడీపీనా అని వారు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యే వద్దు, జగన్ ముద్దు అంటూ ప్లకార్డులు పట్టుకున్నారు. ఎమ్మెల్యే కారుని కూడా అడ్డుకోవడంతో వివాదం మరింత ముదిరింది. ఎమ్మెల్యే మద్దతుదారులు, ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అయితే ఎమ్మెల్యే వర్గం దీన్ని మరో వర్గం కుట్రగా కొట్టిపారేసింది. విశాఖలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎమ్మెల్యేను వద్దన్న గ్రామస్తులు జగన్ ని మాత్రం కావాలనడంతో.. వైసీపీ నేతలు కూడా ఎలా రియాక్ట్ కావాలో తెలియని పరిస్థితి. అందుకే ఈ విషయంలో ఎక్కడివారక్కడే గప్ చుప్ గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: