ప్ర‌పంచంలోనే అత్యంత గొప్ప ప్ర‌జాస్వామ్య దేశంగా పేరున్న అగ్ర‌రాజ్యం అమెరికాలో సైతం రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో ఉన్న లోపాలు తక్కువేమీ కాదు. ఆరేళ్ల క్రితం 2016లో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన స‌మ‌యంలో అక్క‌డ అధ్య‌క్షుడి ఎన్నిక ప్ర‌క్రియ సుదీర్ఘంగా నెల‌ల త‌ర‌బ‌డి సాగ‌డం దీనినే చాట‌డంతో ప్ర‌పంచం విస్తుపోయింది. అప్ప‌ట్లో రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున ట్రంప్ పోటీ చేయ‌గా మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింట‌న్ స‌తీమ‌ణి హిల్ల‌రీ క్లింట‌న్ ఆయ‌న ప్ర‌త్య‌ర్థిగా డెమోక్ర‌టిక్ పార్టీ అభ్య‌ర్థిగా త‌ల‌ప‌డ్డారు. అమెరికా అధ్య‌క్షుడ‌య్యాక ట్రంప్ విదేశీ వ్య‌వ‌హారాలు, ఆర్థికం స‌హా ప‌లు అంశాల‌పై దూకుడైన వైఖ‌రిని అవ‌లంబించారు. చైనాను వ్యాపార భాగ‌స్వామిగా కాక ప్ర‌త్య‌ర్థిగానే ప‌రిగ‌ణిస్తామ‌ని చెబుతూ తాను అధికారంలో ఉన్నంత కాలం ఆ దేశానికి చుక్క‌లు చూపించారు ట్రంప్. స‌హ‌జంగా వ్యాపార‌వేత్త అయిన ట్రంప్ వ‌ల‌స‌ల నిరోధానికి, అమెరికన్ల ఆర్థిక ప్ర‌యోజ‌నాలు కాపాడేందుకు త‌న‌దైన శైలిలో కృషి చేశార‌నే చెప్పాలి. అందుకే ఆ దేశంలో ఆయ‌న‌ను వ్య‌తిరేకించేవారి సంఖ్య‌కు దీటుగా స‌మ‌ర్థించేవారి సంఖ్య కూడా ఉంది. గ‌డ‌చిన కొన్ని ద‌శాబ్దాల కాలంలో అమెరికాలో ఇంత‌టి వివాదాస్ప‌ద అధ్యక్షుడిగా మ‌రెవ‌రూ అప‌కీర్తి మూట‌గ‌ట్టుకోలేద‌న్న‌ది వాస్త‌వం.

2020లో జ‌రిగిన అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రెండోసారి ఎలాగైనా తానే గెల‌వాల‌ని డొనాల్డ్ ట్రంప్ చేప‌ట్టిన చ‌ర్య‌లు, ఆయ‌న‌ తెంపరిత‌నం, నాటి ప‌రిణామాలు చూసి అమెరిక‌న్లే కాదు ప్ర‌పంచ‌మంతా నివ్వెర‌పోయింది. అధికారాన్ని ఉప‌యోగించుకుని అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను గుప్పిట ప‌ట్టి తానే అధ్య‌క్షుడిగా కొనసాగేందుకు ట్రంప్ చేసిన ప్ర‌య‌త్నాల‌కు ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడుకోవాల‌నే అక్క‌డి వ్య‌వ‌స్థ‌ల్లోని కీల‌క వ్య‌క్తులు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో ట్రంప్ ఆట‌లు సాగ‌లేదు. అప్ప‌ట్లో నాటి ప‌రిణామాల‌పై కోర్టు ఆదేశాల మేర‌కు ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న‌ బైడెన్ ఆధ్వ‌ర్యంలోని డెమోక్ర‌టిక్ పార్టీ ప్ర‌భుత్వం విచార‌ణ జ‌రుపుతున్న నేప‌థ్యంలో ట్రంప్ చేసిన దుశ్ఛ‌ర్య‌ల్లో మ‌రొక‌టి తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఆ ఎన్నిక‌ల్లో ఓటింగ్ యంత్రాల‌ను స్వాధీనం చేసుకోవాల‌ని ఆదేశిస్తూ అమెరికా ర‌క్ష‌ణ శాఖ కార్య‌ద‌ర్శికి అప్ప‌ట్లో ప్రెసిడెంట్ ట్రంప్లేఖ రాసేందుకు పూనుకున్నార‌ట‌. అయితే ఇత‌ర అధికారులు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో అది ముందుకు వెళ్ల‌లేదు. ఒక‌వేళ ఆయ‌న ఆదేశాలు అమ‌లై ఉంటే ఎన్నిక‌ల ఫ‌లితాలు మ‌రో రెండు నెల‌లకు పైగా ఆల‌స్య‌మై ఉండేవి. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో విదేశీ శ‌క్తులు జోక్యం చేసుకున్నాయ‌ని, ఆ కుట్ర‌లు ఛేదించాల్సి ఉంద‌ని అప్పట్లో ట్రంప్ ఆయ‌న వ‌ర్గీయుల వాద‌న‌గా ఉంది. ఎన్నిక‌ల ఫ‌లితాలు ట్రంప్‌కు వ్య‌తిరేకంగా వ‌స్తున్న స‌మ‌యంలో ట్రంప్ అనుకూల వ‌ర్గాలు పెద్ద సంఖ్య‌లో అక్క‌డి క్యాపిట‌ల్ హిల్ భ‌వ‌నంపై దాడికి దిగడంతో నాడు తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తాయి. అప్ప‌ట్లో ట్రంప్ చేసిన అప్ర‌జాస్వామిక చ‌ర్య‌లకు ఆధారాలు ల‌భ్య‌మ‌వుతుండ‌టంతో ఆయ‌న‌పై ఎలాంటి చ‌ర్య‌లుంటాయో చూడాల్సిఉంది. మొత్తంమీద 1789లో జార్జివాషింగ్‌ట‌న్ తొలి అధ్య‌క్షుడిగా పాల‌నాప‌గ్గాలు చేప‌ట్టింది మొద‌లు రెండు శ‌తాబ్దాలకు పైగా ఘ‌న‌మైన చ‌రిత్ర ఉన్న‌ అమెరికా ప్ర‌జాస్వామ్యంలో ట్రంప్ ఓ మ‌ర‌క గానే మిగిలిపోతారని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: