ఇవాళ దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమం ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇందు కోసం పీహెచ్‌సీలు, సామాజిక, ప్రాంతీయ అంగన్వాడీ కేంద్రాల్లో పోలియో చుక్కలు పంపిణీ చేయనున్నారు. అంతే కాకుండా ఏపీలో గ్రామ సచివాలయాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో పోలియో చుక్కలు అందుబాటులో ఉంచుతారు. ఇవాళ ఏపీలో పోలియో చుక్కలు వేయించుకోలేని చిన్నారులకు రేపు, ఎల్లుండి కూడా పోలియో చుక్కులు వేస్తారు.


ఇవాళ మిస్ అయితే.. సోమ, మంగళవారాల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారు. ఆంధ్ర ప్రదేశ్‌లో పల్స్‌ పోలియో టీకా వేయడానికి రూ.7 కోట్లు వరకూ ఖర్చు అవుతోంది. ఈ ఖర్చును రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భరిస్తాయి. కేంద్రం 60 శాతం నిధులు సమకూరుస్తుంటే.. రాష్ట్రం 40 శాతం నిధులు సమకూరుస్తుంది.


ఇక అటు తెలంగాణలోనూ రాష్ట్రవ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమం ఇవాళ ఉంటుంది. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా  23,331 కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ విడతలో మొత్తం 38,31,907 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలోని అన్ని జిల్లాలకు 50.14 లక్షల పల్స్‌ పోలియో డోస్‌లు పంపిణీ చేశారు.


ప్రయాణాల్లో ఉన్న వారి కోసం 869  ట్రాన్సిట్ కేంద్రాలు కూడా  ఏర్పాటు చేశారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వద్ద పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పక వేయించాలని సర్కారు చెబుతోంది. తెలంగాణలోనూ పోలియో చుక్కలు వేయించుకోలేని చిన్నారులకు  రేపు, ఎల్లుండి పోలియో చుక్కలు వేయించుకునే అవకాశం ఉంది. ఇవాళ మిస్ అయిన వారికి సోమ, మంగళ వారాల్లో ఇంటికి  వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు. పోలియో చుక్కలు వేయడం వల్ల పిల్లలకు పోలియో రాకుండా నివారించవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: