రెండు అంశాలపై జగన్మోహన్ రెడ్డి ఫుల్లుగా క్లాసు పీకారని సమాచారం. మొదటిదేమో పట్టభద్రుల ఎంఎల్సీ స్ధానాలను ఓడిపోవటం. ఇక రెండోదేమో మాక్ పోలింగ్ లో ముగ్గురు, నలుగురు వరుసగా తప్పులు చేయటం. 23వ తేదీన ఎంఎల్ఏ కోటాలో భర్తీ అవ్వాల్సిన ఏడు ఎంఎల్సీ స్ధానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఎలాంటి అయోమయం ఉండకూడదని మాక్ పోలింగ్ నిర్వహించారు.





20వ తేదీనుండి మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నా ముగ్గురు, నలుగురు ఓట్లు తప్పుగా వేస్తున్నారట. మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎలాగ వేయాలి, రెండో ప్రాధాన్యత ఓట్లు ఎలా వేయాలనే విషయాలను నిపుణులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పిస్తున్నారు. ఒకటికి పదిసార్లు చెప్పి ట్రయల్ ఓటింగ్ నిర్వహిస్తున్నా ఇంకా కొందరు తప్పులు చేస్తున్నారట. దీనిపై జగన్ బాగా అసహనంగా ఉన్నట్లు సమాచారం.





పట్టభద్రుల ఎంఎల్సీ స్ధానాల పరిధిలోకి వచ్చే మంత్రులు, ఎంఎల్ఏలు, సీనియర్ నేతలపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారట.  ఇపుడు జరిగిన ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, వామపక్షాలు ఏకమవుతున్నాయని తెలిసి కూడా మంత్రులు, ఎంఎల్ఏలు, సీనియర్ నేతలు ఎందుకింత నిర్లక్ష్యంగా ఉన్నారని నిలదీసినట్లు సమాచారం.  ఎన్నిక ఏదైనా జనాలు ఏకపక్షంగా వైసీపీనే ఆధరిస్తున్న సమయంలో ఇపుడు మూడుస్ధానాల్లో ఓటమిని ఎలా తీసుకోవాలని ప్రశ్నించారట.  ఓటమిలో ప్రత్యర్ధిపార్టీల బలంకన్నా మన నిర్లక్ష్యమే ఎక్కువగా కనబడుతోందని మండిపడ్డారు. ఎంఎల్సీ ఎన్నికలు మనవి కావులే అన్న నిర్లక్ష్యమే అంతిమంగా పార్టీ కొంపముంచినట్లు చెప్పారట. ప్రజల దగ్గరకు ఒకటికి రెండు, మూడుసార్లు  వెళ్ళి ఓట్లు అడిగితే కచ్చితంగా గ్రాడ్యుయేట్లు కూడా మనకే ఓట్లేసే వాళ్ళని జగన్ అభిప్రాయపడ్డారట.





అందరు కలిసి సమన్వయంతో పనిచేసుంటే కచ్చితంగా గెలిచుండేవాళ్ళమే అనటంలో సందేహంలేదన్నారట. ఎంఎల్ఏలు చూసుకుంటారులే అని నేతలు, మంత్రులు చూసుకుంటారులే అని ఎంఎల్ఏలు నిర్లక్ష్యంగా ఉన్నట్లు తనకు ఫీడ్ బ్యాక్ వచ్చిందని చెప్పారట. మంత్రులేమో అంతా సీఎమ్మే చూసుకుంటాడులే అని ఉదాసీనంగా ఉన్నారని మండిపడ్డారట. ఇలాంటి పరిస్ధితులు రాకూడదనే తాను గడపగడపకు ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కూడా  జగన్ చెప్పారట. మొత్తంమీద ఓటమిపై జగన్ పీకిన క్లాసులు ఏమన్నా ఉపయోగపడతాయా అన్నది చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: