జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతున్నారా ? పార్టీలోను బయట కూడా ఇపుడిదే అంశంపై చర్చలు ఊపందుకుంటున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్ళాల్సిన అవసరం లేదని పార్టీలో ముఖ్యులు ఇప్పటికే చెప్పారు. అయితే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మూడు పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత పరిణామాలు చకచకా మారిపోతున్నాయి.





రెండువారాల వ్యవధిలో జగన్ ఢిల్లీకి వెళ్ళి నరేంద్రమోడీ, అమిత్ షా తదితరులతో కలవటం, రాష్ట్రానికి నిధులు వస్తుండటాన్ని కూడా ముందస్తుకు సంకేతంగా చూస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను రాబట్టడం, పరిశ్రమల ఏర్పాటులో స్పీడు పెంచటం, సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల చేయటం లాంటివి కూడా అందరిలోను అనుమానాలను పెంచేస్తున్నాయి. అన్నీ కుదిరితే వచ్చే డిసెంబర్లోనే ఎన్నికలు జరగాలని జగన్ అనుకుంటున్నారట.





అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే పొత్తుల  పేరుతో  ప్రతిపక్షాలను సెటిల్ కాకుండా అడ్డుకోవటమే జగన్ టార్గెట్ అంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమికి పొత్తు కూడా కారణమే. పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికల్లో టీడీపీ+పీడీఎఫ్ అధికారికంగా కలిస్తే జనసేన అనధికారికంగా కలిసింది. నిజానికి మూడు స్ధానాల్లో వైసీపీ ఓటమికి ప్రధాన కారణం టీడీపీ అభ్యర్ధులకు పీడీఎఫ్, జనసేన ఓట్లు పడటమే. ఇదే పద్దతిలో రేపటి ఎన్నికల్లో టీడీపీ, వామపక్షాలు, జనసేన పొత్తుపెట్టుకుంటే వైసీపీకి ఇబ్బందులు తప్పవనే ప్రచారం అందరికీ తెలిసిందే.





కాబట్టి ఇలాంటి అనేక విషయాలను జగన్ దృష్టిలో పెట్టుకుని ముందస్తుకు వెళితే సరిపోతుందని అనుకున్నారట. అందుకనే తాను ముందస్తుకు సిఫారసు చేయగానే కేంద్ర ఎన్నికల కమీషన్ ఓకే చేసేట్లు చూడమని అమిత్ షాను జగన్ కోరినట్లు ప్రచారం జరుగుతోంది. డిసెంబర్లో ఎన్నికలంటే అక్టోబర్-నవంబర్లోనే అసెంబ్లీ రద్దయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం పార్టీలో పెరిగిపోతోంది. పరిశ్రమల ఏర్పాటుకు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటిని వేసి ఫాలోఅప్ చేయిస్తున్నది కూడా ఇందుకే అని చెబుతున్నారు.  వీలైనన్ని పరిశ్రమలకు భూమిపూజ చేయించి పనులు మొదలుపెడితే సంక్షేమమే కాదు పరిశ్రమల ద్వారా అభివృద్ధి కూడా చేస్తున్నట్లు జనాలకు చెప్పుకోవచ్చన్నది జగన్ ఆలోచనట. మొత్తానికి ముందస్తు వాతావరణమైతే పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: