మహారాష్ట్రలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మేనల్లుడు అజిత్ పవార్ ఎన్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ కు వెన్నుపోటు పొడిచారు. పార్టీని నిట్టనిలువుగా చీల్చేశారు. తన వర్గంలోని 30 మంది ఎంఎల్ఏలతో కలిసి ఎన్సీపీని వదిలేసి ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంతో చేతులు కలిపారు. దాంతో అజిత్ కి ఉపముఖ్యమంత్రిగాను మరో తొమ్మిది మంది ఎంఎల్ఏలకు మంత్రివర్గంలోనో షిండే చోటు కల్పించారు. వీరి ప్రమాణస్వీకారం కూడా అయిపోయింది. ఇక్కడ వెన్నుపోటంటే శరద్ కుర్చీని మేనల్లుడు లాక్కోలేదు. పార్టీ ఎంఎల్ఏలను చీల్చటం కూడా వెన్నుపోటుగానే చూడాలి.
అజిత్ ముఖ్యమంత్రి షిండేతో చేతులు కలపటం, షిండే మంత్రివర్గం విస్తరణ విషయాన్ని గవర్నర్ కు తెలియజేయటం, ఏర్పాట్లు జరగటం, ప్రమాణస్వీకారం అయిపోవటం అంతా గంటల వ్యవధిలోనే జరిగిపోయింది. మహారాష్ట్రలో ఏమి జరుగుతోందో తెలుసుకునేలోపే అంతా అయిపోయింది. శరద్ పవార్ కు ఊహించని దెబ్బనే చెప్పాలి. పవార్ కు అజిత్ నుండి ఇలా దెబ్బతగలటం రెండోసారి. అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే పార్టీకి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిటంతోనే.
సీనియర్ నేత ప్రపుల్ పటేల్, తన కూతురు సుప్రియా సూలేని పార్టీకి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్లగా నియమించారు. ఇక్కడే శరద్ పవార్ తప్పుచేశారు. తన తర్వాత పార్టీలో కీలకమైన స్ధానాన్ని ఆశిస్తున్న అజిత్ ను కాదని కూతురుకు పట్టంకట్టారు. అప్పటినుండే అజిత్ బాగా మండుతున్నారు. తాను జాతీయ ప్రెసిడెంటుగా ఉన్నపుడు మళ్ళీ కూతురుని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయకపోతే ఏమైంది ? మేనల్లుడు అజిత్ ను చేసుంటే సరిపోయేది. కానీ కూతురు మీద ప్రేమ శరద్ కళ్ళు కప్పేసింది.
అప్పటినుండే అజిత్ వ్యవహారంలో ఏదో తేడా మొదలైంది. మూడు రోజుల క్రితమే అసెంబ్లీలో ఎన్సీపీ పక్షనేతగా అజిత్ రాజీనామా చేశారు. అప్పుడైనా శరద్ మేలుకునుండాల్సింది. కానీ ఆపనిచేయలేదు సరికదా ఉదాసీనంగా వ్యవహరించారు. గతంలో ఇలాగే వ్యవహరించినపుడైనా పార్టీలోకి రానీయకుండా ఉండుంటే సరిపోయేది. కానీ అప్పుడేమో తాను బతిమలాడి, కూతురితో మాట్లాడించి సెంటిమెంటు ప్రయోగించి తిరిగి పార్టీలోకి రప్పించుకున్నారు. ఇపుడు మళ్ళీ అదునుచూసి మేనమామకు వెన్నుపోటు పొడిచి మరీ దెబ్బకొట్టి వెళ్ళిపోయారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి