తెలంగాణా ఎన్నికల్లో ఎంతమంది నేరచరితులు పోటీచేస్తున్నారో తెలుసా ? చట్టసభల్లో నేరచరితులు అడుగుపెట్టకూడదని సామాన్యుల నుండి సుప్రింకోర్టు వరకు అందరు అనుకుంటున్నదే. కానీ ప్రాక్టికల్ గా ఆ కోరిక మాత్రం తీరటంలేదు. ఎందుకంటే అన్నీ పార్టీలు నేరచరితులను ప్రోత్సహించటంలో పోటీలు పడుతున్నాయి కాబట్టే. ఇపుడు విషయానికి వస్తే తెలంగాణాలో వివిధ పార్టీల తరపున పోటీచేస్తున్న 360 మందిలో 226 మంది నేరచరితులే అని బయటపడింది.
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి చెప్పిన ప్రకారం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తరపున ఎక్కువమంది నేరచరితులు పోటీలో ఉన్నారు. అభ్యర్ధులు నామినేషన్ల సందర్భంగా దాఖలుచేసిన అఫిడవిట్ల ఆధారంగా కేసుల వివరాలను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ బయటపెట్టింది. వీళ్ళపై నమోదైన కేసుల్లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమ సమయంలో పెట్టిన కేసులతో పాటు కొందరిపై భూకబ్జాలు, కిడ్నాపులు తదితర క్రిమినల్ కేసులున్నట్లు రెడ్డి చెప్పారు.
ఇపుడు పోటీచేస్తున్న అభ్యర్ధులు గెలిస్తే వచ్చే శాసనసభల్లో ఎక్కువమంది నేరచరితులే ఉంటారని ఆందోళన వ్యక్తంచేశారు. నేరచరితులు ఎన్నికల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని సుప్రింకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేస్తే అది నత్తనడక నడుస్తోందని ఆవేధన వ్యక్తంచేశారు. అందుకని ప్రజలే తమ విజ్ఞత ప్రకారం ప్రతినిధులకు ఓట్లేయాలని పిలుపిచ్చారు. రెడ్డి ఇచ్చిన వివరాల ప్రకారం బీఆర్ఎస్ తరపున పోటీచేస్తున్న 58 మంది మీద 120 కేసులు నమోదయ్యాయి. కేసీయార్ మీద 9 కేసులు, గంగుల కమలాకర్ మీద 10, కేటీయార్ పైన 8 కేసులున్నాయి. అలాగే కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్న 84 మందిపై 540 కేసులున్నాయి.
ఇందులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీదే 89 కేసులు, వెడమ బొజ్జపై 52 కేసులు, ప్రేమ్ సాగర్ పై 32, పురుమల్ శ్రీనివాస్ పై 24, జయప్రకాష్ రెడ్డిపై 20 కేసులు నమోదయ్యాయి. ఇక బీజేపీ తరపున పోటీచేస్తున్న 78 మీద 548 కేసులున్నాయి. రాజాసింగ్ పై 89 కేసులు, బండి సంజయ్ పై 59, సోయం బాబూరావుపై 55, ఎంఐఎం తరపున పోటీచేస్తున్న ఆరుమందిపై 11 కేసులున్నాయి. అక్బరుద్దీన్ పై 6 కేసులు నమోదైనట్లు పద్మనాభరెడ్డి చెప్పారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి