సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ శ్రీకాకుళం ఎచ్చెర్ల మండల వైసీపీ మాజీ అధ్యక్షులు, ఎచ్చెర్ల మాజీ సర్పంచ్ జరుగుళ్ల శంకర్రావుపై శుక్రవారం నాడు రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.శంకరరావు రాత్రి 8గంటల సమయంలో S.M.పురం రోడ్‎లో ఎచ్చెర్ల లోని తన ఇంటికి వెళుతుండగా మాస్కులు ధరించి ఉన్న ఇద్దరు వ్యక్తులు కాపుకాసి వెనుక నుండి దాడి చేశారు. ఆ దాడి చేసే సమయంలో శంకర్ ముఖాన్ని వెనుకకు తిప్పడంతో తల వెనుకభాగంలో తగలవలసిన ఆయుధం ఎడమ చెంపకు తగిలి ఎడమ కన్ను, చెంప భాగంపై తీవ్ర గాయమై బాగా రక్తస్రావం జరిగింది. ఆ దాడి జరిగిన వెంటనే బైక్ నడుపుతున్న శంకర్ అనుచరుడు మురళీ వాహనాన్ని ఆపితే ఎక్కువ ప్రమాదం అని భావించి ఆపకుండా నేరుగా శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్‎కి తీసుకుపోయాడు. ఆ తరువాత శంకర్ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు. శంకర్ రావు ప్రస్తుతం వైసీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. అలాగే అతని భార్య విజయ కూడా ఎచ్చెర్ల మండల వైస్ MPP గా కొనసాగుతున్నారు.శంకర్ గత కొంతకాలం నుంచి ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్‎పై అసమ్మతి స్వరాన్ని వినిపిస్తున్నారు.


ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా నియోజకవర్గంలో సొంత పార్టీలోని కొందరు అసమ్మతి నేతలతో కలిసి ర్యాలీలు, ప్రెస్ మీట్‎లు నిర్వహించారు. కిరణ్ వద్దు జగన్ ముద్దు అంటూ కూడా నినదించారు. ఇక ఈ క్రమంలో శంకర్‎పై జరిగిన ఈ దాడి నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతోంది. శంకర్‎ను చంపాలనే ఉద్దేశంతో రాజకీయ ప్రత్యర్థులే మర్డర్ ఎటెంప్ట్ చేయించారని ఆరోపిస్తున్నారు శంకర్ సన్నిహితులు.అలాగే ఈ దాడిపై పోలీసులు లోతైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దాడి చేసిన వారిని, చేయించిన వారిని తొందరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.శంకర్ పై దాడి జరిగిందన్న విషయం తెలుసుకొని అతని కుటుంబసభ్యులు, అనుచరులు ఇంకా సహచర నాయకులు శ్రీకాకుళంలో చికిత్స అందుతోన్న హాస్పిటల్ దగ్గరకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో హాస్పిటల్ వద్ద శుక్రవారం నాడు అర్ధరాత్రి వరకు హై టెన్షన్ నెలకొంది. తర్వాత శంకర్‎ను అర్థరాత్రి వేళ కుటుంబసభ్యులు వేరే హాస్పిటల్ కు తరలించారు.ఇక శంకర్‎పై జరిగిన దాడి గురించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: