జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు తింగరిమాటల్లాగే అనిపిస్తోంది. తాను అన్ని వేల పుస్తకాలు చదివాను, ఇంతమందితో మాట్లాడాను అని చెప్పుకోవటమే తప్ప అందులో నిజంలేదని ఇపుడు బయటపడింది. విషయం ఏమిటంటే టీడీపీ, జనసేన తరపున మొదటిజాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రకటించిన 118 సీట్లలో టీడీపీ 94 మంది, జనసేన 24 అసెంబ్లీ అభ్యర్ధులున్నారు. టీడీపీయేమో అభ్యర్ధులను కూడా ప్రకటించేసింది. జనసేన మాత్రం ఐదు నియోజకవర్గాల్లోనే ప్రకటించింది.





పొత్తులో జనసేన చాలా తక్కువ సీట్లు తీసుకోవటంపై పార్టీ జనాలతో పాటు కాపులు కూడా మండిపోతున్నారు. అయితే మీడియాతో  పవన్ మాట్లాడుతు తక్కువ సీట్లు తీసుకున్నందుకు రెండు కారణాలను చెప్పారు. అవేమిటంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించటం ఒక్కటే లక్ష్యంగా మెట్టుదిగి తక్కువ సీట్లకు ఒప్పుకున్నట్లు చెప్పారు. అలాగే రెండో కారణం ఏమిటంటే బీజేపీ పొత్తు పెట్టుకుంటుందనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తక్కువ సీట్లకు ఒప్పుకున్నట్లు చెప్పారు. నిజంగా రెండు కారణాలు కూడా సొల్లు కారణాలుగానే కనబడుతున్నాయి.





ఇక్కడ పొత్తులో పోటీచేయాల్సిన అవసరం ఎవరికుంది అంటే చంద్రబాబునాయుడుకు మాత్రమే. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాల్సిన అవసరం చంద్రబాబుకే కాని పవన్ కు లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకపోతే టీడీపీ బతుకు బస్టాండు అయిపోతుంది. లోకేష్ భవిష్యత్తు అంథకారమైపోతుంది. జనసేనతో పొత్తులేకపోతే చంద్రబాబు ఒంటరిగా పోటీ కూడా చేయలేరు. ఏరకంగా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం చంద్రబాబుదే అయినపుడు జనసేన తక్కువ సీట్లకు అంగీకరించాల్సిన అవసరం ఏముంది ?





పైగా బీజేపీ కూడా కలిసొస్తుందనే తక్కువ సీట్లకు ఒప్పుకున్నట్లు పవన్ చెప్పటంలో అర్ధమేలేదు. బీజేపీ ఎన్నిసీట్లకు పోటీచేయాలి ? కమలానికి ఎన్నిసీట్లివ్వాలన్నది చంద్రబాబు, బీజేపీ తేల్చుకుంటాయి. బీజేపీతో పొత్తు అవసరమని చంద్రబాబు అనుకుంటే బేరాలాడి ఎన్నోకొన్ని సీట్ల దగ్గర సెటిల్ చేసుకుంటారు. బీజేపీ పొత్తులోకి రావటం కోసం జనసేన సీట్లెందుకు తగ్గించుకోవాలో ఎవరికీ అర్ధంకావటంలేదు.  పవన్ చెప్పిన రెండు కారణాలు కూడా ఉత్త సొల్లుగానే అనిపిస్తోంది. తక్కువ సీట్లకు అంగీకరించటానికి అసలు కారణాలు వేరే ఉన్నాయనే ప్రచారం పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: