ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ కు సంబంధించి ఎలాంటి కామెంట్లు చేయకపోవడంతో ఆయన అభిమానులు తటస్థంగా ఉన్నారు. అయితే ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ జపం చేస్తూ చంద్రబాబు, టీడీపీ నేతలకు షాకిచ్చే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం.
 
తాజాగా కొడాలి నాని మాట్లాడుతూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీని కష్టపడి గెలిపిస్తే ఏం జరుగుతుందని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను తుంగలో తొక్కుతారని కామెంట్లు చేశారు. ఆ తర్వాత లోకేశ్ ను అధికారంలో కూర్చోబెడతారని వెల్లడించారు. అందుకే తారక్ ఫ్యాన్స్ గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాల్సిన అవసరం ఉందని కొడాలి నాని పేర్కొన్నారు. ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు పట్టుకుంటే మాత్రమే అతని ఫ్యాన్స్ టీడీపీకి మద్దతు ఇవ్వాలని కొడాలి నాని అన్నారు.
 
టీడీపీని చిత్తుచిత్తుగా ఓడిస్తే మాత్రమే టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పగించేలా ఫ్యాన్స్ బుద్ధి చెప్పాలని ఆయన కామెంట్లు చేశారు. బాబు గతంలో చేసినవి గుర్తు పెట్టుకుని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిర్ణయం తీసుకోవాలని కొడాలి నాని కామెంట్లు చేశారు.
 
తెలుగుదేశంను ఓడించి తన ఫ్రెండ్ తారక్ కు గిఫ్ట్ ఇస్తానని కొడాలి నాని పేర్కొన్నారు. కొడాలి నాని కామెంట్ల నేపథ్యంలో తారక్ ఫ్యాన్స్ ఏం చేస్తారో చూడాల్సి ఉంది. కూటమికి వ్యతిరేకంగా తారక్ ఫ్యాన్స్ పని చేస్తే మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలు మారే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ అభిమానులు మాత్రం కొడాలి నాని కామెంట్లపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్నికల్లో ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: