జనసేన నేతలు ప్రచార రంగంలోకి దిగి, “జూబ్లీ హిల్స్‌లో కమలానికి ఓటు వేయండి” అంటూ జనాల్లో పిలుపునిస్తున్నారు. దీంతో ఎన్డీఏలోనూ మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఇక టీడీపీ వైపు చూస్తే, ఆ పార్టీ స్థానం కీలకం. ఎందుకంటే జూబ్లీ హిల్స్‌లో 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. సెటిలర్ ఓట్లు, ముఖ్యంగా ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న సామాజిక వర్గాలు ఈ ప్రాంతంలో ప్రబలంగా ఉన్నాయి. లెక్కల ప్రకారం ఈసారి కూడా ఆ వర్గాల ఓట్లు బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉన్నా, టీడీపీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. దాంతో పార్టీ అభిమానులు ఎవరికీ తోచినట్లు ఓటు వేయొచ్చనే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరపునే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఒకప్పుడు టీడీపీలో కీలక నాయకుడిగా ఉన్న రేవంత్‌కి టీడీపీ అభిమాన వర్గాల ఓట్లు కాంగ్రెస్ వైపుకి వెళ్లే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ ఎన్నిక ఆయన వ్యక్తిగత ప్రాధాన్యానికి కూడా పెద్ద పరీక్షగా మారింది. మరోవైపు వైసీపీ – బీఆర్‌ఎస్ స్నేహం మళ్లీ చర్చకు వస్తోంది. 2014 నుండి ఈ రెండు పార్టీల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, ఇప్పుడు కూడా ఆ సమన్వయం కొనసాగుతోందని చెబుతున్నారు. జూబ్లీ హిల్స్‌లో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు బాగానే ఉండటంతో, వైసీపీకి అనుకూలంగా ఉన్న ఓటర్లు బీఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నికలో అసలు గేమ్ చేంజర్స్‌గా సెటిలర్ ఓట్లు కనిపిస్తున్నాయి. ఏపీ నుంచి హైదరాబాద్‌లో స్థిరపడిన వర్గాలు ఈ నియోజకవర్గంలో నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాయి. ఈ ఓట్లే అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయిస్తాయని విశ్లేషకుల అభిప్రాయం. మొత్తం మీద, జూబ్లీ హిల్స్ బైఎలక్షన్ కేవలం తెలంగాణా ఎన్నిక కాదు - ఇది ఆంధ్రా పార్టీల భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు దిశానిర్దేశం చేసే పోరాటం. ఎవరి స్టాండ్ స్పష్టమవుతుందో, ఎవరి వ్యూహం ఫలిస్తుందో చూడాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి