ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య రంగంలో మరో విప్లవాత్మక మార్పుకు సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ అందరికీ చేరేలా, ప్రతి ఇంటికీ వైద్య సదుపాయం అందేలా “ఎన్టీఆర్ ఇంటింటి వైద్యం” పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న వ్యాధులకైనా పట్టణాలకో, జిల్లా ఆసుపత్రులకో వెళ్లాల్సిన అవసరం లేకుండా చేసేలా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం “విలేజ్ క్లినిక్‌లు” పేరుతో ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు వేసిన విషయం తెలిసిందే. కానీ ఎన్నికల కారణంగా ఆ కార్యక్రమం సగం దారిలోనే ఆగిపోయింది.
 

అయితే మంచి ఆలోచన కావడంతో, రాజకీయాల పక్కన పెట్టి చంద్రబాబు ప్రభుత్వం దానిని కొత్త రూపంలో, మరింత విస్తృతంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి, ఆచరణాత్మక ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ కొత్త పథకం ప్రకారం, ప్రతి గ్రామాన్ని క్లస్టర్లుగా విభజించి, ప్రతి యాభై ఇళ్లకు ఇద్దరు ఏఎన్‌ఎంలు (ఆశా కార్మికులు) కేటాయించనున్నారు. వీరు ప్రతీ ఇంటికీ నిరంతరం వెళ్లి ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తారు. మొబైల్ పరికరాల ద్వారా రక్తపరీక్షలు, షుగర్, మూత్ర, క్షయ, మలేరియా, కలరా, ఎయిడ్స్ వంటి టెస్టులను తక్షణం నిర్వహించి, రిపోర్టులను కూడా వెంటనే అందిస్తారు. మందులు, ఇంజక్షన్లు అవసరమైతే ఉచితంగా అందిస్తారు.

 

ప్రాథమిక దశలో ఈ ప్రాజెక్టును నవంబర్ 20న సీఎం చంద్రబాబు స్వయంగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ప్రారంభించనున్నారు. అక్కడి అనుభవాల ఆధారంగా తరువాత దశల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని విస్తరించనున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావడమే కాకుండా, చిన్న వ్యాధులు పెద్ద సమస్యలుగా మారకుండా ముందుగానే గుర్తించి చికిత్స చేయవచ్చు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆరోగ్యరంగంలో పెద్ద మార్పును తీసుకురానుందని నిపుణులు అంటున్నారు. ఈ ప్రాజెక్టు సక్రమంగా అమలు అయితే, “ప్రజల ఆరోగ్యం – ప్రభుత్వ భాధ్యత” అనే నినాదం నిజంగా నెరవేరుతుందనడంలో సందేహం లేదు. “ఎన్టీఆర్ ఇంటింటి వైద్యం” ప్రజల జీవితాల్లో నూతన ఆశను నింపే ఆరోగ్య విప్లవంగా నిలుస్తుందనేది ఇప్పుడు అందరి అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి: