దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన తాజా బాంబ్ బ్లాస్ట్‌పై సంచలనం రేపే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ తాహా సిద్దిఖీ చేసిన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ, ఇస్లామాబాద్‌లో ఇటీవల జరిగిన కారు బాంబ్ పేలుళ్ల వెనుక పాకిస్తాన్ ఆర్మీనే ఉందని ఆయన ఘోర ఆరోపణలు చేశారు. తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్  లో తాహా సిద్దిఖీ చేసిన పోస్ట్‌లో ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండు దేశాల్లోనూ జరిగిన ఈ పేలుళ్లను ఆత్మాహుతి బాంబర్లు నిర్వహించారని, కానీ ఆ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు పాకిస్తాన్ ఆర్మీ అధికారులేనని ఆరోపించారు. "ఈ ఆత్మాహుతి దాడులు యాదృచ్ఛికంగా జరగలేదు. వీటికి ఆర్మీ ఉన్నతాధికారుల ఆదేశాలే కారణం" అని తాహా స్పష్టంగా తెలిపారు.


ఆయన మరింతగా మాట్లాడుతూ — “పాకిస్తాన్ ఆర్మీకి ఉగ్రవాద సంస్థలతో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఈ కనెక్షన్ వల్లే ఆ దేశం మాత్రమే కాకుండా, దక్షిణాసియా మొత్తం అస్థిరతలోకి నెట్టబడుతోంది. పాక్ ఆర్మీ ఇస్లామిక్ టెర్రరిజాన్ని ఒక రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తోంది. దానిని పూర్తిగా ఆపకపోతే ఈ ప్రాంతంలో శాంతి స్థాపన అసాధ్యం” అని వ్యాఖ్యానించారు. తాహా సిద్దిఖీ తన పోస్ట్‌లో మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు. “పాకిస్తాన్ ప్రభుత్వం మరియు ఆర్మీ ఒకే లక్ష్యంతో పని చేస్తున్నాయి — తమ దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా అల్లకల్లోలం సృష్టించి, దాని ద్వారా రాజకీయ లాభం పొందడం. ఇది వారి పాత వ్యూహం” అని అన్నారు. ఆయన అభిప్రాయంలో, పాక్ ఆర్మీ ఇచ్చే రక్షణ, ప్రోత్సాహం వల్లే టెర్రరిస్ట్ గ్రూపులు మరింత రెచ్చిపోతున్నాయి.


అంతేకాక, తాహా సిద్దిఖీ తన ఎక్స్ అకౌంట్‌లో అల్ ఖైదా టెర్రరిస్ట్ మాట్లాడుతున్న వీడియోను కూడా పంచుకున్నారు. ఆ వీడియోలో ఉన్న వివరాలు పాకిస్తాన్ ఆర్మీకి టెర్రర్ గ్రూప్‌లతో ఉన్న అనుబంధాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. “ఈ వీడియో ఒక్కటే చాలు — పాక్ ఆర్మీ ఉగ్రవాద సంస్థలను ఎలా ఉపయోగించుకుంటుందో, వాటికి ఎలా మద్దతు ఇస్తుందో ప్రపంచానికి అర్థమవుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. తాహా సిద్దిఖీ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇప్పటికే భారత నిఘా సంస్థలు ఢిల్లీ పేలుడు ఘటన వెనుక ఉన్న అంతర్జాతీయ కుట్రలపై దృష్టి సారించగా, తాహా చేసిన ఈ ఆరోపణలు ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చేలా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ, టెర్రరిజం మధ్య ఉన్న అనుబంధంపై గతంలోనూ పలు అంతర్జాతీయ సంస్థలు వ్యాఖ్యానించగా, ఇప్పుడు ఆ దేశం నుంచే ఒక జర్నలిస్ట్ ఇలాంటి విషయాలను బయటపెట్టడం గణనీయమని విశ్లేషకులు చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: