మావోయిస్టు ఉద్యమంలో వయసు మీరిన నాయకుల మధ్య సమర్థుడిగా దూసుకొచ్చిన యువ నాయకుడు హిడ్మాను పోలీసులు ఇటీవల ఎన్‌కౌంటర్ చేశారు. హిడ్మా మరణానంతరం, ఈ అంశంపై అర్బన్ నక్సల్స్‌గా పేరొందిన కొంతమంది వ్యక్తులు, గ్రూపులు సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ప్రచారం చేయడం, సానుభూతిని వ్యక్తం చేయడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. హిడ్మాను హీరోగా కీర్తిస్తూ, ఆయన మరణాన్ని వాడుకుని మరింత మంది యువతను అడవుల్లోకి పంపేందుకు, రిక్రూట్‌మెంట్‌ను పెంచేందుకు వీరు ప్లాన్ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిడ్మా ఎన్‌కౌంటర్‌ను వాడుకుంటూ, మావోయిస్టులపై సానుభూతిని పెంచడానికి అర్బన్ నక్సల్స్ కుట్రలు చేస్తున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
 

ఇక ఇలాంటి కుట్రల వల్లే హిడ్మా లాంటి సమర్థులైన యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజా నాయకుడు కావాల్సిన హిడ్మా.. ఎన్‌కౌంటర్‌కు బలి..అడవుల్లో ఉండి రాజ్యాధికారాన్ని సాధించడం ఈ కొత్త, ఆధునిక ప్రపంచంలో సాధ్యం కాదని అందరికీ తెలుసు. రాజ్యం బలోపేతమైన ఈ సమయంలో, మావోయిస్టులకు ఉన్న ఏకైక ఆప్షన్ ప్రజాస్వామ్యం మాత్రమే. హిడ్మా లాంటి సమర్థులైన యువ నాయకుడికి: ప్రజాస్వామ్య మార్గంలో తమ లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేసేలా మార్గనిర్దేశం చేసి ఉంటే, ఆయన మంచి ప్రజా నాయకుడు అయి ఉండేవారు. కానీ, అర్బన్ నక్సల్స్ ఆయనను రెచ్చగొట్టి, ఆయుధాలు వదిలేది లేదంటూ దాడులకు పురికొల్పారు.



 ఫలితంగా, ఆయనకు ఎన్‌కౌంటర్ తప్ప మరో మార్గం లేకుండా పోయింది. సోషల్ మీడియాలో హీరోగా మార్చే కుట్ర..హిడ్మా ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు, బయట పెద్దగా నిరసనలు, ఆందోళనలు జరగలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం అర్బన్ నక్సల్స్ ఆయనను హీరోను చేస్తున్నారు. హిడ్మా సొంత ఊరు, ఆయన నేపథ్యం గురించి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. నిస్వార్థంగా ఉద్యమం చేశారని చెబుతున్నా, హిడ్మా వందల మందిని చంపడంలో కీలక పాత్ర పోషించారు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, ఉద్యమం కొనసాగదని తెలిసినప్పుడు లొంగిపోయేలా ఆయనకు మార్గదర్శనం చేయాల్సిన అర్బన్ నక్సల్స్... ఎన్‌కౌంటర్ అయ్యేంత వరకూ వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఆయన మరణాన్ని మార్కెటింగ్ చేస్తూ, మావోయిస్టులపై సానుభూతి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.



విప్లవం పేరుతో విలాస జీవితం.. మావోయిస్టు ఉద్యమం గొప్పదని ఉద్యమాలు చేసేవారు, దానికి మద్దతుగా మాట్లాడి, పోస్టులు పెట్టేవారు ఒక్కరు కూడా అడవుల్లోకి వెళ్లరు. వారు మాత్రం సకల సౌకర్యాలతో మంచి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. తమ పిల్లలను చదివించుకుని అమెరికాకు పంపుతూ ఉంటారు. కానీ, అడవుల్లో ఉండే నక్సల్స్ మాత్రం కుటుంబాలను కూడా పట్టించుకోకుండా, ఉద్యమంలోనే ఉండాలని వీరు ప్రేరేపిస్తారు. ఇలాంటి ద్వంద్వ నీతి ఉన్నవారి కారణంగానే హిడ్మా లాంటి సమర్థవంతమైన నాయకత్వాన్ని దేశం కోల్పోవాల్సి వస్తోంది. ఈ అర్బన్ నక్సల్స్ తమ మాటలతో ఇంకెంతమంది యువత జీవితాలను నాశనం చేస్తారనేది ఆలోచించాల్సిన విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: