ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ పార్టీకి లేని కంచుకోట మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి ఉంది. అదే పులివెందుల! దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి తిరుగులేని ఆదరణ ఉన్న ఈ నియోజకవర్గంలో... ఇటీవల జరిగిన పరిణామాలు ఇప్పుడు జగన్‌ను పునరాలోచనలో పడేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన నేటి నుంచి మూడు రోజుల పాటు సొంత జిల్లా కడపలో పర్యటించడానికి సిద్ధమయ్యారు. కనీసం ఏజెంట్లను కూడా నిలపలేక...జగన్ రెడ్డి పర్యటన వెనుక ఉన్న అసలు కారణం... ఇటీవల జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పులివెందులలో ఎదురైన ఘోర పరాజయం! ముఖ్యమంత్రిగా వరుసగా ఐదేళ్లు తిరుగులేని అధికారాన్ని అనుభవించిన జగన్‌కు... ప్రతిపక్షంలోకి రాగానే సొంత కంచుకోటలోనే ఊహించని షాక్ తగిలింది.

 పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ కనీసం తమ పార్టీ ఏజెంట్లను కూడా ఏర్పాటు చేసుకోలేని దుస్థితి ఎదురైంది! దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో కలిసి ప్రయాణం చేసిన స్థానిక కార్యకర్తలు కూడా ఉప ఎన్నికల సందర్భంగా వెనకడుగు వేయడం, చేతులెత్తేయడం పార్టీ దయనీయ పరిస్థితికి అద్దం పట్టింది. ఈ ఘోర అవమానం, కార్యకర్తల మనోధైర్యం పూర్తిగా దెబ్బతినడం... ఇప్పుడు జగన్ ముందున్న అతిపెద్ద సవాలుగా మారింది. కేడర్ రెస్క్యూ మిషన్: 'ప్రజా దర్బార్' వ్యూహం! .. ఈ క్లిష్ట సమయంలో పార్టీ అధినేత జగన్ చేపట్టిన మూడు రోజుల పర్యటన కేవలం సాధారణ పర్యటన కాదు, ఇది ఒక 'కేడర్ రెస్క్యూ మిషన్'! ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు తన క్యాంప్ ఆఫీస్‌లో నిర్వహించనున్న 'ప్రజా దర్బార్' ప్రధానంగా కార్యకర్తలు, స్థానిక నేతలతో మమేకం కావడానికే అని తెలుస్తోంది.

ఇక ఈ దర్బార్ ద్వారా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి, నాయకుల వైఫల్యాలు ఏమిటి, కార్యకర్తల్లో ఎందుకు మనోధైర్యం సన్నగిల్లింది అనే అంశాలపై ఆయన కూలంకషంగా చర్చించనున్నారు. అలాగే, రేపు బ్రహ్మణపల్లిలో అరటి తోటలను పరిశీలించి, రైతులతో మాట్లాడనున్నారు. ఈ పర్యటన ద్వారా జగన్... పతనమైన క్యాడర్ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నింపి, వారికోసం తాను ఉన్నాననే భరోసా ఇచ్చే దిశానిర్దేశం చేయాల్సి ఉంది. పులివెందుల నుంచే పార్టీకి నైతిక స్థైర్యాన్ని అందించకపోతే... రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పుంజుకోవడం మరింత కష్టమవుతుంది! ఈ ప్రజా దర్బార్ ద్వారా జగన్ ఎలాంటి ప్రణాళికను ప్రకటిస్తారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: