విశాఖ జిల్లాలో రాజకీయాల్లో సుదీర్ఘ కెరీర్ కలిగిన మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఒకసారి ఎంపిగా, ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఓటమి ఎరుగని నాయకుడు. డబుల్ హ్యాట్రిక్ కొట్టిన ఘనతతో పాటు, ఏడేళ్ల పాటు మంత్రిగా సేవలందించడం ఆయన రాజకీయ కెరీర్‌లో ముఖ్యమైన ఘట్టం. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని ఎదుర్కొని గెలవడం, 2024లోనూ విజయాన్ని కొనసాగించడం, విశాఖ ప్రజల మనసులో ఆయన స్థానాన్ని మరింత బలపరిచింది.

కానీ, 2024 ఎన్నికల తర్వాత, పార్టీ అధికారంలో ఉన్నా మంత్రిపదవి దక్కకపోవడం ఆయనకు ఒక కొత్త సవాలు. పార్టీ పెద్దలు సీనియర్ నేతలకు కాకుండా తర్వాతి తరం నాయకులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించడంతో, గంటా మంత్రిపదవికి దారితప్పారు. ప్ర‌స్తుతం గంట తన రాజకీయ వారసుడిగా కుమారుడిని ప్రోత్సహిస్తున్నారు. 2029 ఎన్నికల్లో, తాను పోటీ చేయకుండా, కుమారుడు రాజకీయ రంగంలో అడుగు పెట్టేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. ఇక‌పోతే సోమ‌వారం గంటా బ‌ర్త్‌డే వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ఇంట‌ర్వ్యూలు ఇచ్చిన గంటా శ్రీనివాసరావు.. త‌న పొలిటిక‌ల్ రిటైర్మెంట్ ప్లాన్‌ను రివీల్ చేశారు.

తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక ఆహ్లాదకరమైన వాతావరణంలో హాయిగా జీవించాలని, బీచ్ ఒడ్డున టీ తాగుతూ న్యూస్‌పేపర్ చదువుతూ ప్రశాంతంగా సమయం గడపాలని ఉందని కోరిక వ్యక్తం చేశారు. అయితే మిగిలిన మూడు సంవత్సరాల్లో, అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి, 2029 ఎన్నిక‌ల్లో కుమారుడ్ని ఎమ్మెల్యేగా చూసిన తరువాతే తన రాజకీయ పదవీ విరమణ ప్రకటించ‌వ‌చ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కాగా, గంటా రాజకీయ జీవితానికి గుడ్‌బై పలకడానికి సిద్ధంగా ఉన్నార‌న్న‌ది స్ప‌ష్ట‌మైంది . అయితే, ఆయన రిటైర్మెంట్ కేవలం వ్యక్తిగత విశ్రాంతి కోసం మాత్రమే కాకుండా, రాజకీయ వారసత్వాన్ని భద్రం చేసుకోవడానికి ఒక వ్యూహాత్మక ప్రణాళికగా కూడా భావించవచ్చు. విశాఖ రాజకీయాల్లో ఇది కొత్త దశ ప్రారంభమవ్వడానికి సంకేతంగా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: