శ్రీకాళ‌హ‌స్తి ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ యువ నాయ‌కుడు బొజ్జ‌ల సుధీర్‌రెడ్డిని వైసీపీ త‌క్కువ‌గా అంచ‌నా వేసింది. ఆయ‌న వ‌ల్ల పెద్ద‌గా త‌మ‌కు న‌ష్టం లేద‌ని.. మాజీ ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న‌రెడ్డి ఇటీవ‌ల ఆన్‌లైన్ చానెల్‌తో మాట్లాడుతూ కామెంట్లు చేశారు. కానీ, బొజ్జ‌ల తాజాగా త‌న విశ్వ‌రూపం చూపించారు. వైసీపీకి భారీ షాకిచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు ఎంపీపీ పదవి టీడీపీ కైవసం అయ్యేలా చ‌క్రం తిప్పారు. అంతేకాదు.. వైసీపీ ఎంపీటీసీల‌ను పార్టీలోనూ చేర్చుకున్నారు.


 వైసీపీ ఎంపీటీసీల‌కు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.. వారికి భ‌రోసా కూడా క‌ల్పించ‌డం విశేషం. మొత్తంగా  9 మంది వైసీపీ ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవ‌డంతో ఇక్క‌డి పార్టీకి భారీ షాక్ త‌గిలిన‌ట్టు అయింది. అనంతరం ప్రజాస్వామ్యబద్ధంగా సామరస్యంగా  తొమ్మిది మంది ఎంపీటీసీలు కలిసి ఏకగ్రీవంగా పంగురు గ్రామానికి చెందిన ఆది లక్ష్మమ్మ ను ఎంపీపీగా ఎన్నుకున్నారు. దీనివ‌ల్ల లోక‌ల్‌గా సుధీర్ రెడ్డి విజ‌యం ద‌క్కించుకున్న‌ట్టు అయింది.


వాస్త‌వానికి శ్రీకాళ‌హ‌స్తి ఎమ్మెల్యేపై కొన్నాళ్ల కింద‌ట ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వాటినుంచి ఆయ‌న బ‌య‌ట ప‌డ‌డ‌మేకాకుండా.. పార్టీని బ‌లోపేతం చేసే కార్య‌క్ర‌మానికి కూడా శ్రీకారం చుట్టారు. వ‌చ్చే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నాటికి క్షేత్ర‌స్థాయిలో ప‌సుపు కండువా జోరు పెరిగేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా ఎంపీపీ ప‌ద‌విని ద‌క్కించుకోవ‌డంతోపాటు వైసీపీ ఎంపీటీసీల‌ను కూడా చేర్చుకున్నారు. ఇదిలా వుంటే.. పార్టీ అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపైనా దృష్టి పెట్టారు.


క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ అవుతూ.. వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. త ద్వారా లోక‌ల్‌గా వైసీపీ నేత‌ల‌కు చెక్ పెడుతున్నారు. పార్టీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేయాల‌ని మంత్రి నారా లోకేష్ ఇచ్చిన పిలుపు మేర‌కు.. ఆదిశ‌గా అడుగులు వేస్తున్నారు. త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెడుతూనే మ‌రోవైపు.. ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌తోపాటు పార్టీ కార్య‌క్ర‌మా ల‌ను కూడా స‌మ‌న్వ‌యం చేసుకుంటున్నారు. దీంతో శ్రీకాళ‌హ‌స్తిలో వైసీపీకి ఇప్పుడు చుక్క‌లు క‌నిపించే ప‌రిస్థితి ఎదురుకానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: