వైసీపీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? ఆ పార్టీ ఎలా పుంజుకుంటుంది? రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయ అడుగులు వేస్తుంది? అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు… బీజేపీ పెద్దల మధ్య కూడా చర్చకు వచ్చినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇటీవల ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఎంపీలతో ఏపీ, తెలంగాణ రాజకీయాలపై సమీక్ష నిర్వహించిన సమయంలో, కేవలం తమ కూటమి రాజకీయాల గురించే కాకుండా… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి ? ఆ పార్టీ ఏ దిశగా వెళ్తోంది ? అనే అంశాలపై కూడా ఆరా తీసినట్టు తెలుస్తోంది. నిజానికి బీజేపీ రాజకీయ వ్యూహాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఏ రాష్ట్రంలోనైనా సరే, ఒకే పార్టీకే పూర్తిగా కట్టుబడి ఉండే విధానం బీజేపీకి లేదు. 2024 ఎన్నికలకు ముందు ఏపీలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ టీడీపీ విషయంలో బీజేపీ చాలా ఆచితూచి అడుగులు వేసింది. సూపర్ సిక్స్ మేనిఫెస్టో ప్రకటించిన సమయంలో బీజేపీ నేతలు పెద్దగా స్పందించకపోవడం, ప్రచారంలో చురుకుగా పాల్గొనకపోవడం అందుకు నిదర్శనం.


అయితే ఇటీవల నెలలుగా మాత్రమే సూపర్ సిక్స్ అంశాన్ని బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. అంటే బీజేపీ ఎక్కడైనా ఒకే విధంగా వ్యవహరిస్తుంది. ఏ పార్టీని పూర్తిగా దూరం చేసుకోకుండా, అవసరమైన చోట ‘సావకాశాలు’ చూసుకుంటూ రాజకీయంగా ఎదగడమే దాని వ్యూహం. ఏపీలోనూ అదే ఫార్ములాను అనుసరిస్తోంది. గతంలో టీడీపీతోనూ, అవసరమైతే వైసీపీతోనూ పరోక్షంగా కలిసి రాజకీయాలు చేసిన అనుభవం బీజేపీకి ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రస్తుత పరిస్థితిని బీజేపీ పెద్దలు లోతుగా అంచనా వేసినట్టు సమాచారం. వైసీపీ పరిస్థితిలో తక్షణ మార్పులు కనిపించడం లేదని, పార్టీ ఇంకా పాత విధానాలకే పరిమితమై ఉందని బీజేపీ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతానికి కూటమికే బలంగా నిలవాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


పార్టీని మొదటి నుంచి వైఎస్‌.జ‌గ‌న్ న‌డిపిస్తున్నా ... ఆయన ఎక్కువగా సలహాదారులు, ఐప్యాక్ లాంటి వ్యూహాత్మక బృందాలపైనే ఆధారపడటం కొనసాగుతోంది. ఇది కొంతవరకు లాభం చేకూర్చినా, స్పష్టమైన సిద్ధాంతం లేకపోవడం పార్టీకి మైనస్‌గా మారిందన్న అభిప్రాయం ఉంది. ఇప్పటికీ వైసీపీ అదే తరహా రాజకీయ వ్యూహాల కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మళ్లీ రాజకీయ వ్యూహకర్తల కోసం వెతుకుతున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఈ పరిస్థితులను గమనిస్తున్న బీజేపీ, వైసీపీకి దూరంగా ఉంటూనే, ప్రస్తుత కూటమిని బలోపేతం చేయడమే సరైనదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ రాజకీయ పునరుత్థానం ఏ దిశగా సాగుతుందో, బీజేపీ వ్యూహాలపై అది ఎంత ప్రభావం చూపుతుందో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: