హైదరాబాద్: పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మరోమారు తెలం‘గానం’కు మద్దతు ప్రకటించారు. ముందు నుంచీ బొత్స తెలంగాణపై ఒక అభిప్రాయంతో ఉన్నారు. కొట్లాడుకుంటూ ఒకటిగా ఉండటంకంటే విడిపోయి అందరమూ కలిసికట్టుగా ఉండటం మేలనేది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. రాష్ర్టం విడిపోవడానికి తనకెలాంటి అభ్యంతరం లేదనేది సత్తిబాబు ఎప్పటి నుంచో చెబుతున్నాడు. ఆయన చెబుతూ వస్తున్నట్లుగా తాజాగా మరోమారు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారు. తెలంగాణపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను సమర్ధించారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడిన బొత్స హిందీ మాట్లాడుతున్న వారికి 13 రాష్ర్టాలున్నప్పుడు తెలుగు మాట్లాడే వారికి రెండు రాష్ర్టాలు ఉండటంలో తప్పేముందన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదో ఒకటి త్వరగా తేల్చడమే అందరికీ మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ఇవ్వడమా? రాష్ర్టాన్ని సమైక్యంగా వుంచడమా? అనే దానిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్న తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు. అదిగో తెలంగాణ, ఇదిగో తెలంగాణ అంటున్న కేసీఆర్ను అదే పార్టీకి చెందిన ఎంపీ విజయశాంతి, కాంగ్రెస్ పార్టీకి చెందిన నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ, టీజేఏసీ ఛైర్మన్ కోదండరామిరెడ్డి తదితరులు కూడా తప్పుబట్టారు. కేంద్రం అంత సులువుగా తెలంగాణ ఇస్తుందనే నమ్మకం లేదనీ, పోరాటాల ద్వారానే తెలంగాణ సాధించుకోవల్సిందనీ కాంగ్రెస్ ఎంపీ యాష్కీ అన్నారు.  అయితే, తెలంగాణ విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ సత్తిబాబు పూర్తిగా మద్దతు ప్రకటించారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో తెలంగాణ వస్తుందన్న కేసీఆర్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదనీ సత్తిబాబు చెప్పారు. దీనితో తెలంగాణపై కేంద్రం కూడా సానుకూలంగా ఉండి ఉండవచ్చనేది స్పష్టమవుతోంది. ఆదివారం నాడు రాష్ర్టపతి ఎన్నిక ఓట్ల లెఖ్కింపు కాగా, ఈ నెల 25న కొత్త రాష్ర్టపతి ఎన్నిక ఉంటుంది. రాష్ర్టపతి ఎన్నిక ప్రక్రియ ముగియగానే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై ద్రుష్టిని మళ్లించడం ఖాయంగా తెలుస్తోంది. దీనికి పీసీసీ చీఫ్ సత్తిబాబు వ్యాఖ్యలే ఉదాహరణ. 

మరింత సమాచారం తెలుసుకోండి: