హైదరాబాద్: పాలకులు పట్టించుకోరు. వైద్యాధికారుల అడ్రస్ వుండదు. అడుగడుగునా సిబ్బంది నిర్లక్ష్యం. మొత్తం కలిపి పిల్లలు పిట్టల్లారాలిపోతున్నారు. తల్లిదండ్రులకు మాత్రం కడపుకోతే మిగులుతోంది. రాష్ర్టంలోని తిరుపతి, వరంగల్, కర్నూలు, హైదరాబాద్ లోని చిన్న పిల్లల దవాఖానలలో ఈ నెలలోనే 30మంది పిల్లలు చనిపోయారు. తాజాగా మరో నలుగురు చిన్నారుల శ్వాస ఆగింది. తల్లిదండ్రుల రోదన అరణ్యరోదనగానే మిగిలిపోతోంది.  కనీస వసతులు లేక చిన్నారులు చనిపోతున్నారు. ఈ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం కోసం కావల్సిన పనిముట్ల కోసం సర్కార్ కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తున్నట్లు చెబుతోంది. కానీ, వాస్తవానికి అవి ఎక్కడికి వెళ్తున్నాయో, ఏమవుతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు, అంతుచిక్కడం లేదు. శిశు మరణాలకు కారణాలు తెలుసుకునే పనిలోనే సర్కార్ వుంది. శిశు మరణాలకు గల కారణాలను తెలుసుకోవడానికి సర్కార్ నియమించిన కమిటీలు ఓ వైపు విచారణ చేస్తుండగానే...మరోవైపు వైద్యం అందక చిన్నారులు చనిపోతూనే ఉన్నారు. ముఖ్యంగా తిరుపతిలోని రుయా, వరంగల్ లోని ఎంజీఎం చిన్న పిల్లల ఆసుపత్రులలో వరుస శిశు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. రుయాతో పాటు వరంగల్ ఎంజీఎంలో వెంటిలేటర్ల కొరత కారణంగా ఇద్దరు చిన్నారులు చనిపోయారు. వరుస శిశు మరణాలు జరుగుతున్నా కూడా సర్కార్ తీసుకోవల్సిన చర్యలు తీసుకున్న పాపాన పోవడం లేదు. ఈ చిన్న పిల్లల ఆసుపత్రులో జరుగుతున్న శిశు మరణాలన్నీ ఒకమాటలో చెప్పాలంటే సర్కార్ చేస్తున్న ‘హత్య’లుగానే చెప్పాలి.  చిన్నారులకు కనీస వైద్యం అందించ లేని నిస్సహాస్థితిలో ఈ సర్కార్ ఉందంటే అంతకన్నా సిగ్గుచేటుకరమైన విషయం మరొకటి ఉండదు. వరంగల్ ఎంజీఎం, తిరుపతి రుయా, కర్నూలులోని ఆస్పత్రి, హైదరాబాద్ లోని నీలో ఫర్ ఆస్పత్రులన్నీ చిన్న పిల్లల మరణాలకు కేరాఫ్ గా మారాయి. ఆక్సిజన్ అందక చిన్నారులు చనిపోతుండటం నిజంగా సిగ్గుతో ఈ సర్కార్ తలదించుకోవాలి. వరుసగా చిన్నారులు మ్రుత్యువాతకు గురౌతున్నా అటు వైద్యులకు, ఇటు పాలకులకు ఏమాత్రం చీమకుట్టినట్లు కూడా లేదనీ సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.  చిన్న పిల్లల ఆస్పత్రులలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. నిండు నూరేళ్లు బతకాల్సిన చిన్నారులు సరైన వైద్యం అందక ఆకుల్లా రాలిపోతున్నారు. నిధులు లేక, వైద్యం అందక పోవడం మొత్తం కలిపి చిన్నారుల ఉసురు తీస్తున్నాయి. గత అనుభవాలను పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. వందలాది మంది తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలేది కాదు. ఇప్పటికైనా పాలకులు స్పందించి చిన్న పిల్లల దవాఖానలపై ప్రత్యేక ద్రుష్టిని మళ్లించాల్సిన అవసరం ఎంతయినా వుంది. లేదంటే మరి కొందరు తల్లిదండ్రులకు కడుపుకోత తప్పదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: