హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ కాలంగా పని చేసిన ప్రణబ్ ముఖర్జీకి నేటితో ఆ పార్టీతో, రాజకీయాలతో సంబంధాలు కటీఫ్ కానున్నాయి. వచ్చే నెలలో జరగనున్న రాష్ర్టపతి ఎన్నికల్లో ప్రణబ్ యూపీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం విధితమే. దీనితో ఆయన కేంద్ర ఆర్థిక శాఖా మంత్రికి, కాంగ్రెస్ పార్టీ పాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు.  వచ్చే నెల 19న రాష్ర్టపతి ఎన్నిక జరగనున్నది. ఈ నెల 28న రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ నామినేషన్ దాఖలు చేస్తారు. పశ్చిమబెంగాల్ లోని మిరాటి గ్రామంలో ప్రణబ్ 1935 డిసెంబర్ 11న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ముఖర్జీకి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. 1969లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 1973లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనేక మంది ప్రధాన మంత్రుల వద్ద ఆయన పనిచేసిన ఘనత ఆయనకు వుంది. రాజకీయవేత్తనే కాదు, మంచి ఆర్థికవేత్త కూడా.  ఇక రాజకీయ నేపథ్యం చూస్తే...కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉంటూ సమస్యలను పరిష్కరిస్తూ అపర చాణుక్యుడుగా పేరు తెచ్చుకున్న ప్రణబ్ తన 43ఏళ్ల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ నుంచే కాక పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటుచేసుకున్నారాయన. అమోఘమైన తెలివి తేటలు ఆయన సొంతం. సంక్షోభ పరిష్కరకర్తగా ఉంటూ వస్తున్న ప్రణబ్ కాంగ్రెస్కు దూరం కావడం ఆ పార్టీకి కొంత నష్టం కలిగించే విషయమే.  ప్రణబ్కు వీడ్కోలు సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సభ్యులు మొదలుకుని రాహూల్, సోనియా, ప్రధాని అందరూ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు కూడా. అయితే, 43ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలకు ప్రతిఫలంగా కాంగ్రెస్ అధినేతి సోనియా గాంధీ రాష్ర్టపతి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీని ఖరారు చేసింది. విశేషమైన జాపకశక్తి, ఏ సమస్యనైనా ఇట్లే పరిష్కరించగలిగే శక్తిసామర్ధాలున్నప్రణబ్ను భవిష్యత్ రాజకీయాలను ద్రుష్టిలో పెట్టుకుని రాష్ర్టపతి అభ్యర్థిగా ఎంపిక చేసారనే మరో వాదన కూడా వుంది. కాంగ్రెస్ పార్టీలో ప్రణబ్ లేని లోటును తీర్చడం కష్టమనే చెప్పాలి. కానీ, ఆయనను రాష్ర్టపతి అభ్యర్థిగా ఖరారు చేయడమనేది కూడా రాజకీయ ఎత్తుగడలో భాగంగానే తెలుస్తోంది.  ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ర్టపతిగా ప్రణబ్ ఎంపిక కావడం పెద్ద కష్టంగా కనిపించడం లేదు. రాష్ర్టపతి ఎంపికను సోనియా ప్రతిష్టగా తీసుకుంది. ప్రధాని కూడా ఇప్పటికే రంగంలోకి దిగారు. యూపీఏ భాగస్వామ్య పార్టీలతో పాటు మిగతా పార్టీల అధినేతలకు ఫోన్లు చేసి మద్దతు కోరుతున్నారు. దేశంలోని మెజార్టీ పార్టీలు ప్రణబ్కు మద్దతు తెలిపే అవకాశాలున్నాయి. ఎన్డీఏలోని కొన్ని పక్షాలు కూడా ప్రణబ్కు మద్దతు తెలుపుతున్నాయి. దీనితో ప్రణబ్ ఎంపిక లాంఛనమనే చెప్పాలి.         

మరింత సమాచారం తెలుసుకోండి: