భూములు లేనటువంటి నిరుపేదలను గుర్తించి వారికి ఆరవ విడత భూపంపిణీ కార్యక్రమంలో పట్టాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్దపడుతుంది. ఈ ప్రక్రియను నవంబర్ 3న రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పుట్టపర్తిలో ప్రారంభించనున్నారు. అరవ విడత భూపంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్ మినహాయించి దాదాపు 80 వేల ఎకరాల భూమిని నిరుపేదలకు పంపిణీ చేయనున్నారు. కాగా గతంలో ఐదవ విడత భూపంపిణీలో అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఇచ్చినటువంటి భూముల్లో చాలా మందికి ఇప్పటి వరకు భూములు చూపించలేదు. దీంతో మళ్లీ 6విడత భూపంపిణీ చేస్తామని ప్రభుత్వం సిద్దం కావడంతో నిరసనలు వ్యక్తమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో పట్టాలిచ్చినవారికి భూములు చూపించనటువంటి సంబంధిత రెవెన్యూ అధికారులు మళ్లీ పట్టాలివ్వడం కోసం సిద్దపడుతున్నారు. దీంతో అసలు పట్టాలిచ్చిన వారికి భూములున్నాయా లేదా ఎవరి కబ్జాలోనైనా ఉన్నాయనేది ఇప్పటి వరకు సంబంధిత అధికారులకే తెలియని పరిస్థితి ఏర్పడింది. గతంలో పట్టాలిచ్చినటువంటి వారిలో 40వేల మంది లబ్దిదారులకు భూములను ఇప్పటి వరకు చూపించలేదు. దీంతో సంవత్సరాలుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టు బాధితులు తిరిగి ఏ మాత్రం ఫలితం లేక పోవడంతో ఇక నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు పట్టాలు పొంది తమ భూములు ఎక్కడున్నవో తెలియని బాధితులు ఆయా జిల్లాలో ఆరవ విడత భూపంపిణీ కార్యక్రమం సందర్భంగా నిరసనలు తెలియజేసేందుకు సిద్దమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: