హైదరాబాద్: తెలంగాణ-ఆంధ్ర మధ్య మళ్లీ లొల్లి మొదలైంది. వాటర్ వార్ షురువైంది. సరిహద్దులో మళ్లీ వాతావరణం వేడెక్కుతోంది. ఉద్యమాలకు టీఆర్ఎస్ మళ్లీ సిద్ధమవుతోంది. నాగార్జున సాగర్ నుంచి విడుదల చేసిన నీటిని నిలిపివేయకుంటే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందనీ టీఆర్ఎస్ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ ప్రజల నోళ్లుకొట్టి, భూములను ఎండగొట్టే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తామనీ టీఆర్ఎస్ అంటోంది. అయితే, ఎలాంటి పరిణామాలైనా తాము ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నట్లు విజయవాడకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జోగి రమేశ్, మల్లాది విష్ణు ప్రతి సవాల్ విసిరారు.
తెలంగాణయ ప్రక్రియ ప్రారంభమవుతుందనుకుంటున్న క్రమంలో నీళ్ల గొడవ తెరపైకి వచ్చింది. తెలంగాణ ప్రాంత భూములను ఎండబెడుతూ...ఆంధ్రకు నీళ్లను తరలించకపోవడం ఏమిటనీ టీఆర్ఎస్ గొడవకు దిగుతోంది. ఆంధ్రకు చెందిన కాంగ్రెస్ నాయకులు కూడా తక్కువేమీ తిననట్లుగా తమ ప్రాంతానికి నీళ్లను తీసుకుని పోతాం, ఏం చేస్తారో చేసుకోండంటూ క్రిష్ణా డెల్టాకు నీళ్లను వదలనే వదిలారు. దీనితో మరోమారు ఇరు ప్రాంతాల మధ్యన నీళ్ల రాజకీయాలు ప్రారంభమయ్యాయి. నాగార్జున సాగర్ జలాలపై తీర ప్రాంతాల ప్రజలకూ హక్కు వుందనీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జోగి రమేశ్, మల్లాది విష్ణు వాదిస్తున్నారు.
అయితే, అవకాశమిస్తే ఆంధ్ర నాయకులు తెలంగాణ ప్రజల కన్నీళ్లను కూడా తరలిస్తారనీ టీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్ రావు అంటున్నారు. తెలంగాణ పంట పొలాలను ఎండబెడుతూ.... క్రిష్ణ డెల్టాకు నీరును విడుదల చేయడం పట్ల తెరాస తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. క్రిష్ణ డెల్టా ప్రాంతానికి బుధవారం నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జోగి రమేశ్, మల్లాది విష్ణు 500క్యూసెక్కుల నీటిని నీటిని విడుదల చేశారు. ఈ నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ తెరాస నేత తన్నీరు హరీశ్ రావు ఆధ్వర్యంలో నల్గొండలో మహాధర్నాను నిర్వహించారు.
డెల్టా ప్రాంత ప్రజల తాగుతో పాటు నారుమళ్ల కోసం ప్రకాశం బ్యారేజ్ నుంచి ఈ నీటిని విడుదల చేస్తున్నట్టు విజయవాడ బ్రదర్స్ ప్రకటించారు. ఈ నీటి విడుదలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు, మంత్రులలో భిన్నభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. విజయవాడ బ్రదర్స్ మాత్రం తాము రైతులకు అండగా ఉన్నామంటూ, వారిలో ఆత్మస్థయిర్యాన్ని నింపేందుకు ఎవరు అడ్డు తగిలినా కూడా నీటిని విడుదల చేశారు. క్రిష్ణ డెల్టాకు విడుదల చేసిన నీటిని తక్షణం నిలిపి వేయకుంటే సాగర్ను ముట్టడించేందుకు ఉద్యమాలకు సిద్ధమవుతున్నట్టు టీఆర్ఎస్ హెచ్చరించింది. దీనితో ఈ సరిహద్దు ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఇరు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నారు.
ఈ విషయంలో రాష్ర్ట ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. కానీ, రాష్ర్ట పెద్దలు ఒక ప్రాంతానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మళ్లీ సాగర్ జలాల రూపంలో మరోమారు ఉద్యమాలు ఊపందుకునే అవకాశాలు మెండుగానే అగుపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి