హైదరాబాద్: టీడీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన, జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా పేరున్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పార్టీని వీడిన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాశంగా మారాయి. తెలుగు తమ్ముళ్లను కొంత గందరగోల పరిస్థితుల్లోకి నెట్టివేశారు. టీడీపీ కొంత ఇరకాటంలో పడే విధంగా ఆయన మాటలున్నాయనీ అంటున్నారు. టీడీపీలో దుమారాన్ని రేపుతున్నాయి. పైకి అలాంటిదేమీ లేదంటున్నప్పటికీ జూనియర్ వ్యాఖ్యలపై బాగానే చర్చసాగుతోంది.  తనకు ఇప్పటికి 28ఏళ్లంటూనే తనకు రాజకీయాల్లోకి రావాలనీ లేదనీ, పదవులపై ఎంత మాత్రం ఆసక్తి లేదంటూనే టీడీపీ అధినేత చంద్రబాబు పేరును ప్రస్తావించకుండానే పరోక్షంగా కొన్ని సవాళ్లను విసిరారు. రాజకీయాలు మాట్లాడారు. టీడీపీ నా పార్టీ, మా కుటుంబ పార్టీ అంటూ మాట్లాడటం కూడా రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. తనకు ఎవరితో విభేదాలు లేవంటూనే...పార్టీ నాయకత్వ మార్పు గురించి మాట్లాడారు. ఎవరో నలుగురు కూర్చోని పార్టీ నాయకత్వంపై మాట్లాడటం కుదరదంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  పార్టీ నాయకత్వం మార్పుపై అందరితోనూ చర్చించాలనడంలోనే జూనియర్ ఎన్టీఆర్ ‘రాజకీయం’ ఉద్దేశం తేటతెల్లమవుతోంది. తన తాత స్థాపించిన పార్టీని వీడి తాను ఎక్కడికీ పోననీ, తన చివరి శ్వాస వరకు పార్టీలో కొనసాగుతాననీ అన్నారు. అయితే, పార్టీలో కొనసాగడం వరకు బాగానే వుంది. గడిచిన కొన్నేళ్లుగా పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. గత రెండేళ్లలో రాష్ర్టంలో జరిగిన 42అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయాన్ని చవి చూసింది. పార్టీకి కంచుకోట అనుకునే నియోజక వర్గాల్లో బొక్కాబోర్లపడ్డది. అన్ని వర్గాల ప్రజలు పార్టీకి దూరమవుతున్నారు. ప్రజలు టీడీపీని నమ్మడం లేదు. దీనితో ఏళ్ల తరబడిగా పార్టీలో ఉన్నటు వంటి నాయకులు కూడా పార్టీని వీడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నా తన తాత స్థాపించిన పార్టీలో ఉంటాననీ చెబుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఉప ఎన్నికల్లో ఎక్కడా ప్రచారం చేయలేదు. ఆయన తండ్రి, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరిక్రిష్ణ కూడా ప్రచారానికి వెళ్లిన దాఖలాలు లేవు. పార్టీ అధినేత చంద్రబాబు అన్నీ తానై ప్రచారాం చేశారు. పార్టీ నుంచి అనేక మంది నాయకులు వైఎస్ఆర్ పార్టీ వైపు వలసలు పోతున్నారు. వీరిని ఆపడానికి చేసిన ప్రయత్నాలు లేవు. ఆయనకు అత్యంత సన్నిహితుడైన కొడాలి వంటి వాళ్లు పార్టీని వీడుతుంటే కూడా జూనియర్ ఆపేందుకు ప్రయత్నాలు చేసినట్లు అగుపించలేదు. పార్టీని వీడుతున్న కొడాలితో మాట్లాడబోననీ కూడా ప్రకటించారు. ఒకవేళ పార్టీతో తనకు ఎలాంటి విభేదాలు లేకుంటే, పార్టీ బాగుండాలనుకున్నప్పుడు తనకు అత్యంత సన్నిహితుడైన కొడాలి పార్టీని వీడకుండా చేయడం జూనియర్కు పెద్ద కష్టమేమీ కాదు. జూనియర్ చెబితే కొడాలి వినకుండా పోరనేది స్పష్టం.  పార్టీ తనదేనప్పుడు పార్టీ క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా పట్టించుకోకుండా పోవడం ఏమిటని తమ్ముళ్లలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నా పార్టీ అని, మా కుటుంబ పార్టీ అంటూనే ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకు సినీమా పరిశ్రమ ముఖ్యమంటున్నారు. తనకు ఇటీవలనే పెళ్లయ్యిందనీ, తానిప్పుడు నా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత వుందన్నారు. తనముందిప్పుడు సినీమా, కుటుంబమే ముఖ్యమనడం దేనికి సంకేతం? రాజకీయాల్లోకి రావల్సిన వయసు, అవసరం లేదన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడటం దేనికి అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు.  మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్, బాబు-తన మధ్యన విభేదాలు లేవంటూనే విభేదాల గురించి చెప్పారు. ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడంతా చర్చ జరుగుతోంది. ఇంత జరుగుతున్న హరిక్రిష్ణ కాని, బాలక్రిష్ణ కాని నోరుమెదపడం లేదు. ఇంకా మునుముందు ఏం జరుగబోతుందో చూడాలి మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: