
అయితే.. ఆ ఆశలను వమ్ము చేస్తూ తాజాగా వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చేశారు. ఏపీలో పార్టీపై మరోసారి స్పందించిన షర్మిల.. ఎవరైనా, ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చు.. నేను కూడా అదే చెప్పా అని తన మొన్నటి వ్యాఖ్యలపై స్పందించారు. అయితే తన జీవితం తెలంగాణతోనే ముడిపడి ఉందని.. వైఎస్‌ను ప్రేమించిన తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకే ఇక్కడ పార్టీ పెట్టానని షర్మిల అన్నారు. నేను ఓ మార్గం ఎంచుకున్నా.. అంటూ ఆమె మరింత క్లారిటీగా చెప్పేశారు.
దీంతో ఆమె ఏపీలో పార్టీ పెడతారంటూ జరిగిన ఊహాగానం అంతా తుస్సేనని తేలిపోయింది. రాజకీయాల్లో ఎప్పుడు, ఏదైనా జరగవచ్చన్న షర్మిల.. ఎప్పుడూ తామే అధికారంలో ఉంటామనుకోవడం మూర్ఖత్వం అన్నారు. రాజకీయాల్లో అప్ అండ్ డౌన్, అధికారం మార్పు సహజమని షర్మిల అన్నారు. అదీ నిజమే. ఏదైనా ఓ లక్ష్యం పెట్టుకుని దాని కోసం పోరాడటం తప్పేమీ కాదు.. అంతేకాదు..ముందు లక్ష్యం ఏంటో నిర్దేశించుకోకుండా గాలివాటం రాజకీయాలు చేసేవారి కంటే షర్మిల కాస్త బెటరే అని చెప్పొచ్చు.
అయితే.. ప్రస్తుతానికి మాత్రం తెలంగాణలో షర్మిల పార్టీకి ఏమాత్రం బజ్ కనిపించడం లేదు. తెలంగాణ రాజకీయం మొత్తం కొన్ని రోజులుగా టీఆర్ఎస్, బీజేపీ చుట్టూనే తిరుగుతున్నాయి. బలమైన ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ కూడా కాస్త డల్ అయ్యింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల పార్టీకి స్కోప్ ఉంటుందా అన్నది చూడాలి.