దేశ రాజధాని ఢిల్లీ మరోసారి రక్తపాతం చూసింది. చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన భయంకరమైన పేలుడు దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. సోమవారం సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో లాల్‌ఖిలా మెట్రో స్టేషన్‌ గేట్‌ నంబర్‌-1 వద్ద పార్క్‌ చేసిన కారులో జరిగిన ఈ భారీ విస్ఫోటం క్షణాల్లోనే ఆ ప్రాంతాన్ని నాశనం చేసింది. హైసెక్యూరిటీ జోన్‌లో, రాష్ట్రపతి భవన్‌ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఘటన దేశ భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. ఈ పేలుడులో ఇప్పటి వరకు 11 మంది  ప్రాణాలు కోల్పోగా, 24మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. ఒక్కసారిగా భూమి కంపించినట్లు గట్టిగా శబ్దం రావడంతో ప్రజలు పరుగులు తీశారు. కారు శకలాలు చుట్టుపక్కల భవనాలపైకి ఎగిరిపడ్డాయి. పక్కనే ఉన్న దుకాణాలు, వాహనాలు, మెట్రో గోడలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. రక్తమోడుతున్న ప్రజల కేకలు ఆ ప్రాంతమంతా మార్మోగించాయి. ఒక్క క్షణం నడక ఉన్న రోడ్డు క్షణాల్లోనే శవాల మైదానంగా మారిపోయింది.


ప్రమాదం అనంతరం వెంటనే ఎన్‌ఎస్‌జీ కమాండోలు, డీఎస్‌పీ బాంబ్‌ స్క్వాడ్‌, ఫోరెన్సిక్‌ టీములు అక్కడికి చేరుకుని పరిశీలన ప్రారంభించాయి. మొదటి దశ విచారణలో కారులో హై-గ్రేడ్‌ ఎక్స్‌ప్లోసివ్‌లు  ఉపయోగించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడు శక్తి అంత ఎక్కువగా ఉండటంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఇదంతా సాధారణ ప్రమాదం కాదని, ఇది ఉగ్రదాడి (టెర్రర్‌ అటాక్‌) కావచ్చని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ దాడి వెనుక పాకిస్తాన్‌ ఆధారిత ఉగ్రసంస్థల హస్తం ఉండొచ్చని ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి. పేలుడు జరిగిన స్థలం, సమయం, టార్గెట్‌ అన్నీ ఒక ఉద్దేశపూర్వక ప్లానింగ్‌లో భాగమని అధికారులు విశ్లేషిస్తున్నారు.


ఇదే తరహా దాడులు గతంలో కూడా ఢిల్లీలో పలు సార్లు జరిగాయి. నిపుణుల అంచనా ప్రకారం, ఉగ్రవాదులు ఇలాంటి దాడులు సాధారణంగా తమ నాయకుల విడుదల కోసం లేదా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చేస్తుంటారు. ఈసారి కూడా అదే మోటివ్‌తో దాడి జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఇటీవలి కాలంలో సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని ఉగ్రశిబిరాలు మళ్లీ చురుకుగా మారినట్లు ఇన్‌పుట్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటిస్తూ, ముఖ్యంగా ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అన్ని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, మెట్రో మార్గాలు, మరియు పబ్లిక్‌ ప్లేస్‌లలో పోలీసులు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: