కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పలుచోట్ల ఆలయాల నిర్మాణానికి నడుం కట్టింది టీటీడీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఆలయాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తోంది. ఏటా రూ.200 కోట్ల వరకు వెచ్చిస్తున్న టీటీడీ హిందూ ధర్మ ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తోంది. 

 

శ్రీవారి వైభవం దశదిశలా చాటుతోంది టీటీడీ. హిందూ దర్మ ప్రచారం కోసం టీటీడీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఏటా 200 కోట్లు వరకు వెచ్చిస్తోంది. ఇందులో భాగంగా పురాతన ఆలయాలు పున:రుద్దరణ, పలురాష్ట్రాల్లో ఆలయాల నిర్మాణానికి ఆర్థిక సహయం చేయడం, దేశవ్యాప్తంగా శ్రీవారి కళ్యాణ నిర్వహణ, కళ్యాణ రథాల ద్వారా స్వామివారి వైభవాన్ని చాటి చెప్పడంతోపాటు, వైభవోత్సవాల పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది టీటీడీ. 

 

మరోవైపు ప్రాశస్త్యం కలిగిన ఆలయాలను తమ పరిధిలోకి తీసుకుంటోంది టిటిడి. 1989లో చిత్తూరు జిల్లాలోని అప్పలాయగుంట ఆలయంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటికి 25 ఆలయాలను టిటిడి పరిధిలోకి తీసుకున్నారు. రిషికేష్, నిమ్మకూరు, తాళ్ళపాక, దేవుని కడప, ఒంటిమిట్ట, తిరుచానురు, మన్నారుపోలూరు, ఉపమాక, అనంతవరం, వాల్మీకిపురం, నాగాలాపురం, చంద్రగిరి, తరగొండ వంటి ప్రాంతాల్లో వున్న ఆలయాలు టీటీడీ పరిధిలోకి వచ్చాయి. దీంతోపాటు, శ్రీవారి ఆలయాలు నిర్మించాలన్న ప్రతిపాదన పలు ప్రాంతాల నుంచి వస్తుండడంతో టీటీడీ ఆ దిశగా కూడా అడుగులు వేస్తుంది.

 

శ్రీవారి ఆలయాల నిర్మాణాన్ని తమిళనాడులోని కన్యాకుమారితో మొదలుపెట్టింది టీటీడీ. కన్యాకుమారిలో రూ.22.5 కోట్ల వ్యయంతో ఆలయాన్ని నిర్మించిన టీటీడీ, హైదరాబాద్ లో రూ.25 కోట్ల వ్యయంతో, కురుక్షేత్రలో రూ.35 కోట్లతో, విశాఖపట్నంలో రూ.25 కోట్ల వ్యయంతో,  అమరావతిలో రూ.36 కోట్లతో,  భువనేశ్వర్ లో రూ.7 కోట్లతో, ముంబయిలో రూ.30 కోట్ల వ్యయంతో, చెన్నైలో 6 కోట్ల వ్యయంతో,  సీతంపేట, రంపచోడవరం, పార్వతీపురంలో రూ.12 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తోంది టీటీడీ. 

 

ఉత్తరభారతంలో కూడా పలుచోట్ల ఆలయాల నిర్మాణానికి నడుం కట్టింది టీటీడీ. జమ్ము-కశ్మీర్ తోపాటు, వారాణాసిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆమోదం తెలిపింది టీటీడీ పాలకమండలి. జమ్ము ప్రభుత్వం టీటీడీ ప్రతిపాదనకు వెంటనే అంగీకారం తెలుపుతూ ఏడు ప్రాంతాలలో స్థలాలు కేటాయించింది. వీటిలో నాలుగు స్థలాలు ఆలయాలు నిర్మించేందుకు అనువుగా వున్నట్లు ప్రాథమికంగా నిర్దారించారు ఇంజనీరింగ్ అధికారులు. స్థల ఎంపిక కోసం ఉన్నతాధికారులు జమ్ము వెళ్ళారు. ఈ ఏడాది శ్రీవారి ఆలయ నిర్మాణం మొదలుకానుంది. అటు వారణాసిలో కూడా  వెంకన్న ఆలయ నిర్మాణం జరుగబోతోంది.

 

హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా ఏటా 200 కోట్లు వరకు వెచ్చిస్తున్న టీటీడీ, పలు ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలో ఆలయాల నిర్మాణానికి కూడా నిధులు కేటాయిస్తోంది. ఏటా 3 కోట్ల మంది భక్తులు తరలివచ్చే తిరుమల వెంకన్న ఆలయ వార్షిక బడ్జెట్ రూ.3200 కోట్లకు చేరుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: