కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైన మాసం. ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివారాధనకు అంకితం చేయబడినప్పటికీ, ఆఖరి కార్తీక సోమవారం అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఒక్క రోజు నిష్ఠగా వ్రతం ఆచరిస్తే, ఏడాది పొడవునా చేసిన వ్రత ఫలం, కోటి సోమవారాలు చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలంటు స్నానం చేయాలి. కార్తీక మాసంలో నదీ స్నానానికి విశేష ప్రాధాన్యత ఉంది. నదికి వెళ్లలేనివారు ఇంటి వద్దే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం లేదా ఏదైనా పవిత్ర నదీ జలం కలుపుకోవచ్చు. శుభ్రమైన, కొత్త వస్త్రాలు ధరించాలి. సాధ్యమైతే, రోజు మొత్తం నిష్ఠగా ఉపవాసం ఉండటం ఉత్తమం. అలా ఉండలేనివారు పాలు, పండ్లు లేదా అల్పాహారం తీసుకోవచ్చు.

సూర్యాస్తమయం తర్వాత నక్షత్ర దర్శనం అయ్యే వరకు ఆహారం తీసుకోకుండా ఉండటాన్ని 'నక్తం' అంటారు. రాత్రి పూజ పూర్తయ్యాక ఉపవాసాన్ని విరమించాలి. ఇంట్లోని పూజామందిరాన్ని శుభ్రం చేసి, తులసికోట దగ్గర మరియు శివుడి పటాల ముందు దీపారాధన చేయాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి.

365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగించడం ఈ రోజున ప్రత్యేక ఫలాన్ని ఇస్తుంది. ఇది ఏడాది పొడవునా దీపాలు వెలిగించినంత ఫలితం ఇస్తుందని విశ్వాసం. శివలింగానికి పూజ చేయడం ఈ రోజు ప్రధానం. పంచామృతాలతో (పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర) అభిషేకం చేయాలి. గంధపు నీటితో కూడా అభిషేకం చేయవచ్చు. మారేడు దళాలు (బిల్వ పత్రాలు), తెల్లటి పువ్వులు, జిల్లేడు పువ్వులు, అక్షతలతో శివుడిని భక్తితో పూజించాలి. పాయసం లేదా పులిహోర వంటి నైవేద్యాలను సమర్పించాలి. భక్తి శ్రద్ధలతో 'ఓం నమః శివాయ' అనే పంచాక్షరీ మంత్రాన్ని, లేదా శివ అష్టోత్తరం, శివ సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం వల్ల శివానుగ్రహం లభిస్తుంది.

సూర్యాస్తమయం తరువాత వచ్చే ప్రదోష కాలం శివారాధనకు అత్యంత ముఖ్యమైన సమయం. ఈ సమయంలో మరోసారి దీపారాధన చేసి, వీలైతే శివాలయాన్ని సందర్శించి, అక్కడ కూడా దీపాలు వెలిగించాలి. ఆఖరి సోమవారం నాడు 365 మందికి దానధర్మాలు చేయడం వల్ల కూడా ఏడాది పొడవునా చేసిన వ్రత ఫలితం దక్కుతుందని చెబుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: