టీమిండియా ఫ్యాన్స్‌కి బీసీసీఐ బ్యాడ్ న్యూస్ చెప్పింది. టీమిండియా, ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య జూన్‌ నెలలో జరగాల్సిన వన్డే సిరీస్‌ను వాయిదా వేసినట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా (Jay Shah) బాంబ్‌ పేల్చారు. మే 27న జరిగిన బీసీసీఐ సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో వైట్ బాల్ సిరీస్‌తో సహా వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశం సందర్భంగా ఈ సిరీస్ నిర్వహణపై క్లారిటీ ఇచ్చారు. మొదట్లో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత టీమిండియా ఈ సిరీస్‌ను ఆడేలా షెడ్యూల్ చేశారు. తర్వాత జూన్ 20 నుంచి 30 తేదీల్లో నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఈ సిరీస్ కోసం యువ ప్లేయర్లతో కూడిన జట్టును రంగంలోకి దించాలని బీసీసీఐ భావించింది.

అయితే, ఆసియా కప్, ప్రపంచ కప్ ఈ ఏడాదిలోనే ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే లిమిటెడ్ టైమ్‌ మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ నిర్వహిస్తే ఆటగాళ్లకు కావాల్సిన రెస్ట్ ఉండదు. కాబట్టి ఈ 3 వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను రద్దు చేయవచ్చని ఇటీవల మీడియాలో రూమర్స్ వచ్చాయి. ఈ పుకార్లను ఖండిస్తూ ఆఫ్ఘనిస్తాన్‌-ఇండియా సిరీస్‌ జరుగుతుందని, కాకపోతే దీనిని వాయిదా వేశామని బీసీసీఐ సెక్రటరీ జయ్ షా తెలిపారు. ఈ సిరీస్ ICC ప్రపంచ కప్ 2023కి ముందు సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉందన్నారు. విలేకరులతో మాట్లాడుతూ జే షా ఈ సమాచారాన్ని వెల్లడించారు.

సెప్టెంబరులో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే వైట్-బాల్ సిరీస్ అక్టోబర్ నుంచి జరగనున్న ICC ప్రపంచ కప్ 2023కి టీమిండియా ప్లేయర్లను బాగా సిద్ధం చేస్తుందని అనడంలో సందేహం లేదు. టోర్నమెంట్ ఇండియాలోనే జరుగుతుంది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్లను ఫేస్ చేసే మంచి అవకాశం ఇండియన్ బ్యాటర్స్‌కి లభిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ స్పిన్ బౌలింగ్ విభాగంలో చాలా బలంగా ఉంది. వీరిని ఇండియన్ బ్యాటర్లు ఎదుర్కోవడం వల్ల బాగా రాటుదేలుతారు. ఇది వారికి ప్రపంచ కప్‌లో మరింత ప్రయోజనం చేకూరుస్తుంది.

మరోవైపు డిస్నీ స్టార్‌తో బీసీసీఐ ప్రసార ఒప్పందం ముగుస్తుందని.. కొత్త టెండర్ విడుదలయ్యే వరకు ద్వైపాక్షిక సిరీస్‌కు తగిన ధరను పొందడంపై ఆందోళనలు ఉన్నాయని.. అందుకే దీనిని వాయిదా వేసినట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా వన్డే సిరీస్ టీమ్ ఇండియా ప్లేయర్లకు ప్రయోజనం చేకూర్చేలా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: