ఇంట్నెట్ డెస్క్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఒక్క ట్వీట్‌తో వాట్సాప్‌కు చుక్కలు చూపించాడు. వాట్సాప్ యాజమాన్యంపై ఆగ్రహంతో మస్క్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్ యాజమాన్యం వాట్సాప్ వినియోగదారులకు సంబంధించి తాజాగా ప్రైవసీ పాలసీని మార్చుకుంటున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం వాట్సాప్ వినియోగదారులంతా తమ డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకోవాలని ఆదేశించింది. లేకపోతే వినియోగదారుల ఖాతాను డిలీట్ చేస్తామని హెచ్చరించింది.

ఫేస్‌బుక్ చేసిన ఈ హెచ్చరిక ఎలాన్ మస్క్‌కు నచ్చలేదు. దీంతో ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘సిగ్నల్‌ను వాడుకోండి’ అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. సిగ్నల్ అనేది వాట్సాప్ లానే ఓ సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్. వాట్సాప్‌లా కాకుండా ఇదో ఓపెన్ సోర్స్ యాప్. వాట్సాప్‌కు బుదులగా సిగ్నల్ యాప్‌ను వాడుకోవాలని మస్క్ తన ట్వీట్ ద్వారా సూచించాడు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. అంతేకాదు సిగ్నల్ యాప్ డౌన్‌లోడ్లు కూడా అమాంతం పెరిగిపోయాయి. అయితే ఒక్కసారిగా డౌన్‌లోడ్లు పెరిగిపోవడంతో వెరిఫికేషన్ ఓటీపీలు పంపే వ్యవస్థ కూడా నిలిచిపోయిందట. అయితే దీనిపై స్పందించిన సిగ్నల్ యాప్ యాజమాన్యం సమస్యను పరిష్కరించినట్లు తెలిపింది.

ఒక్కసారిగా యూజర్లు తగ్గిపోయే ప్రమాదం ఫేస్‌బుక్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ప్రతి వాట్సాప్ ఖాతాదారుడూ తమ డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకోవాల్సిన అవసరం లేదని, కేవలం బిజినెస్ అకౌంట్ వినియోగదారులు మాత్రం పంచుకుంటే సరిపోతుందని తెలిపింది. ఒకవేళ ఎవరైనా సాధారణ యూజర్లు కొత్త పాలసీని అంగీకరించినా వారి డేటాను బిజినెస్ అవసరాలకు వినియోగించమని ప్రకటించింది.

ఇదిలా ఉంటే సాధారణంగానే మస్క్, జుకర్ బర్గ్‌లు పాము, ముంగిసల్లా ఉంటారు. వీరిద్దరికీ ఎప్పుడూ పడదు. ముఖ్యంగా జుకర్ బర్గ్‌ను మస్క్ ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటాడు. ఇంతకు ముందు కూడా ఫేస్‌బుక్ చరిత్రను విమర్శనాత్మకంగా చూపిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఏఐ విషయంలోనూ జుకర్ బర్గ్‌‌కు అంత తెలివి తేటలు లేవని విమర్శించాడు. ఏదైతేనేం మస్క్ ఒక్క ట్వీట్‌తో ఫేస్‌బుక్ తన పాలసీనే మార్చుకునే పరిస్థితి ఏర్పడింది.



మరింత సమాచారం తెలుసుకోండి: