మొన్నటి వరకు ఎవరూ అడుగు పెట్టని ప్రదేశం అది. ఒక్క సారి వెళ్లాలంటే సాహసం చేయాలి. బూట్ల చప్పుళ్లు, బుల్లెట్‌ మోతలు, ఎదురు కాల్పులు — ఇవే ఆ ప్రాంతం రోజువారీ సన్నివేశాలు. కానీ కాలం మారింది. పరిస్థితులు మారాయి. ఇప్పుడు అక్కడ పిస్టల్‌ మోతలు కాదు... కెమెరా లైట్స్‌, యాక్షన్‌ అంటూ సినిమా షూటింగ్‌లు సాగుతున్నాయి. అవును, ఇది ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతం కథ. బస్తర్‌లోని అబూజ్‌మడ్‌ ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టుల అడ్డాగా పేరొందింది. సాయుధ దళాలు, ప్రత్యేక ఆపరేషన్లు, పోలీస్‌ ఎన్కౌంటర్లు - ప్రతి రోజు ఒక కలకలం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు భయంతో బతికే రోజులే.


అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌ కగార్‌’ తర్వాత సీన్‌ మొత్తం రివర్స్‌ అయిపోయింది. ఆ ఆపరేషన్‌ వల్ల మావోలు చెల్లాచెదురయ్యారు. పలువురు నాయకులు లొంగిపోయారు. హింసతో వణికిపోయిన బస్తర్‌ ఇప్పుడు ప్రశాంతతతో మెరిసిపోతోంది. ఇక ఇప్పుడు ఆ అడవి ప్రాంతం సహజ సౌందర్యంతో పచ్చగా కళకళలాడుతోంది. దట్టమైన అడవులు, గిరి ప్రదేశాలు, పచ్చిక బయళ్లు - అన్నీ సినిమాటిక్‌గా కనిపిస్తున్నాయి. అందుకే సినిమావాళ్లు కూడా ఆ లొకేషన్లపై దృష్టి సారించారు. తాజాగా ‘దండా కోటుమ్‌’ అనే సినిమా షూటింగ్‌ బస్తర్‌లోని మాస్‌పూర్‌ వద్ద జరుగుతోంది.



 200 మీటర్ల దూరంలోనే పోలీస్‌ క్యాంప్‌ ఉన్నా, షూటింగ్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా సాగుతోంది. ఒకప్పుడు ఒక్క ఫొటో కూడా తీయలేని ఆ ప్రదేశంలో ఇప్పుడు భారీ కెమెరాలు, లైట్స్‌, జనసంచారం కనిపిస్తున్నాయి. స్థానికులు కూడా ఈ మార్పుతో సంతోషంగా ఉన్నారు. సినిమా షూటింగ్‌లతో పక్క ప్రాంతాలకు చిన్నతరహా ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. “ఇక బస్తర్‌ పేరు హింసతో కాదు, హార్మనీతో వినిపించాలి” అంటున్నారు స్థానికులు. మావో అడ్డా నుంచి సినిమా హబ్‌గా మారిన బస్తర్‌ ఇప్పుడు కొత్త చరిత్రను సృష్టిస్తోంది. పిస్టల్‌ నుంచి ప్రొడక్షన్‌ దాకా జరిగిన ఈ మార్పు దేశానికి ప్రేరణగా నిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: