ఈనాడు పత్రికకూ.. ఏపీలో అధికార పార్టీ నేతలకూ ఉన్న తగవు కొత్తది కాదు. జగన్ పొద్దున లేస్తే.. ఈనాడుపైనా.. మరికొన్ని మీడియా హౌజులపైనా మారీచ మీడియా అని మండిపడుతుంటారు. ఆయన బాటలోనే ఇప్పుడు మంత్రులు కూడా వెళ్తున్నారు. తాజాగా నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు.. ఓ పత్రికాసమావేశంలో నేరుగా ఈనాడు జర్నలిస్టుతో గొడవ పెట్టుకున్నారు. ఈనాడు జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా మీ ఇష్టమొచ్చినట్లు రాసుకోండని చెప్పడం చర్చనీయాంశం అయ్యింది.


పోలవరం అంశంపై ఇటీవల ఈనాడు కథనం ప్రచురించింది. పోలవరం అంశంపైనే జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టారు. మంత్రి తాను చెప్పదలుచుకున్నది పూర్తయిన తర్వాత జర్నలిస్టులను ప్రశ్నలు అడగమన్నారు. ఆ సమయంలో ఈనాడు జర్నలిస్టు ఓ ప్రశ్న అడిగారు. ఆయన ప్రశ్నకు అంబటి రాంబాబు నేరుగా సమాధానం చెప్పకుండా గొడవ పెట్టుకున్నంత పని చేశారు. ఒక్కో పత్రికకు ఒక్కో సమాధానం ఉంటుందని సెటైర్లు వేశారు.


ఈనాడు జర్నలిస్టును నువ్వు ఆగవయ్యా.. నువ్వు ఆగు.. నాలా ఎందుకు ఆవేశపడుతున్నావు అన్నారు. పోలవరానికి చంద్రబాబు నిర్ణయాలు శాపంగా మారాయని అంబటి రాంబాబు తన ప్రెస్ మీట్‌లో చెప్పారు. అయితే.. చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలకు కేంద్ర జలసంఘం, డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ ఆమోదం ఉందా లేదా అని ఈనాడు జర్నలిస్టు మంత్రిని ప్రశ్నించారు.


ఇక్కడే అంబటి చిక్కున పడ్డారు. అనుమతి ఉందంటే.. అది చంద్రబాబు తప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తారు.. అప్పుడు తాను కేంద్ర జలసంఘం, డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీని కూడా తప్పుబట్టినట్టు అవుతుంది కదా. అందుకే అంబటి కాస్త తటపటాయించారు. చంద్రబాబు నిర్ణయాలకు కేంద్ర జలసంఘం, డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ అనుమతి ఉంటే ఉండి ఉండొచ్చని సమాధానం చెప్పారు. అయితే.. ఈనాడు జర్నలిస్టు అక్కడితో ఆగలేదు.. ఉండి ఉండొచ్చు అని కాదు సర్‌, ఉందా లేదా కచ్చితంగా చెప్పండని సూటిగా ప్రశ్నించారు.


దాంతో అంబటికి చిర్రెత్తింది.. ఏమిటి ఆవేశపడుతున్నారు? మీది ఏ పత్రిక అంటూ ప్రశ్నించారు. ఈనాడు వారికి ఒక సమాధానం, ఆంధ్రజ్యోతికి మరో సమాధానం ఉంటాయన్నారు. కేంద్ర జలసంఘాన్ని, డీడీఆర్‌పీని నాతో విమర్శించేలా చేయాలనుకుంటున్నావేమో.. నేను అలా చేయనని అంబటి తేల్చి చెప్పారు. మొత్తానికి ఈనాడు జర్నలిస్టుతో అంబటి గొడవ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: