సాపాటు ఎటూ లేదు.. ఓ పాటైనా పాడు బ్రదర్... రాజధాని నగరంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్.. ఈ పాట 70 వ దశకంలో యమా పాపులర్.. కమల్ హాసన్ నటించిన ఆకలి రాజ్యం సినిమాలోదీ పాట.. ఆనాటి భారత దేశంలోని నిరుద్యోగ సమస్య, పేదరికాన్ని కళ్లకు కడుతుంది. అయితే ఈ సినిమా వచ్చి దాదాపు 40 ఏళ్లు దాటిపోయాయి.. కానీ.. మన దేశంలో ఇంకా ఆకలి కేకలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికీ రూ. 5 భోజనం క్యాంటీన్ల ముందు అభాగ్యులు క్యూ కడుతూనే ఉన్నారు.


దేశంలో ఎవడెంతైనా సంపాదించుకోనీ.. వందల కోట్ల కూడబెట్టుకోనీ.. కానీ.. ఒక్కడూ ఆకలితో అలమటించకూడదు.. ఇది రాజ్యాంగ బాధ్యత. కానీ దీన్ని పట్టించుకునే వాడెవరు.. ఇప్పుడు ఈ సమస్యను మానవతా హృదయంతో ఆలోచించారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ ఎన్‌ వీ రమణ. దేశంలో కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వాలకు దిశానిర్దేశనం చేశారు. కిచెన్ల ఏర్పాటుపై కేంద్రం ప్రణాళిక రూపొందించాలన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. ప్రణాళిక రూపొందించకపోతే తామే ఆదేశాలిస్తామన్నారు.


ఈ దేశంలో ప్రజలు ఆకలితో చనిపోతున్నారని.. ఇంకా ఈ దేశంలో ఆకలి చావులు బాధాకరమని  జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున ఏదో వివరణ ఇవ్వబోగా.. ఇది పౌష్టికాహార లోపం అంశం కాదని... ఆకలికి సంబంధించినదని సీజేఐ చేసిన వ్యాఖ్యల వెనుక మానవీయ కోణం ఉంది. కేంద్రం, రాష్ట్రాలు కలసి నడవాల్సిన ఉమ్మడి పథకంపై రాష్ట్రాలతో కేంద్రం భేటీ నిర్వహించాలని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. కేంద్రం అన్ని రాష్ట్రాలతో సమావేశమై 3 వారాల్లో ప్రణాళిక ఇవ్వాలని ఆదేశించారు.


ఓవైపు దేశంలో బియ్యం పుచ్చిపోతుంటాయి.. బాబోయ్.. ఇన్ని దాన్య రాశులు మేం కొనలేంబాబోయ్ అని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొత్తుకుంటోంది. అదే సమయంలో దేశంలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఎక్కడ ఉంది లోపం.. నాయకుల చిత్తశుద్ధిలో ప్రభుత్వాల అలసత్యంలో.. దీన్నే  జస్టిస్ ఎన్వీ రమణ మరోసారి ఎత్తి చూపారు. ఆలోచింపజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: