
2016 నుంచి 2018 వరకూ గత ప్రభుత్వం భాగస్వామ్య సదస్సుల ద్వారా 1,739 ఎంఓయూలను కుదుర్చుకున్నారు. వీటి ద్వారా 18,87,058 కోట్ల పెట్టుబడులు వస్తాయని అనుకున్నా.. అందులో 10శాతం కూడా వాస్తవరూపం దాల్చలేదని ఇప్పుడు అధికారులు చెబుతున్నారు. ఇటీవల
విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా 387 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. పరిశ్రమలు వాణిజ్య శాఖ తరఫున 100 ఒప్పందాలు కుదిరాయి. ఇందులో 13 ఒప్పందాలు ఇప్పటికే వాస్తవ రూపం దాల్చాయి. రూ.2,739 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
ఈ ప్రాజెక్టుల ద్వారా 6,858 మందికి ఉద్యోగాలు లభించాయి. రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలు పనులు మొదలు పెట్టనున్నాయి. జనవరి 2024లోపు 38 కంపెనీలకు పనులు ప్రారంభం అవుతాయి. మార్చి 2024లోపు మరో 30 కంపెనీలు పనులు పూర్తిచేసుకుని ఉత్పత్తిని ప్రారంభిస్తాయి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ ద్వారా ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెలన్నీకూడా ఫిబ్రవరి 2024 నాటికి పనులు ప్రారంభించేలా చూడనున్నారు.
పారిశ్రామిక రంగం ప్రగతిలో ఎంఎస్‌ఎంఈలది కీలక పాత్ర అని భావిస్తున్న సీఎం జగన్.. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ఈ రంగంలోనే ఉన్నాయని భావిస్తున్నారు. ఎంఎస్‌ఎంఈలకు మార్గదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు ఆయన సూచిస్తున్నారు. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఉత్పత్తులు ఏంటో పరిశీలించాలని.. వాటి ఉత్పత్తిని సాధించడానికి ఎంఎస్‌ఎంఈలకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం ఉత్పత్తి అయిన వస్తువులకు అంతర్జాతీయంగా ప్రముఖ బహుళజాతి సంస్థలతో అనుసంధానం వంటి ఈ మూడు అంశాలపై దృష్టిపెట్టాలని సీఎం జగన్ అంటున్నారు.